Ind vs NZ 2nd ODI : న్యూజిలాండ్‌తో మరో ఆసక్తికర పోరుకు సిద్దమవుతోంది టీమ్ఇండియా. తొలి వన్డేలో 300లకు పైగా పరుగులు చేసినప్పటికీ బౌలర్లు విఫలం కావడంతో మ్యాచ్‌ను కోల్పోయిన టీమ్ఇండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నిలవాలంటే ఆదివారం హామిల్టన్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో తప్పకగెలవాల్సిందే. ఒక వేళ గనుక ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించకుంటే సిరీస్‌ను కోల్పోవడంతో పాటు ఐసీసీ వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోతుంది.
ఐసీసీ వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం భారత్ ఖాతాలో 129 పాయింట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు టీమ్ఇండియా 19 మ్యాచులు ఆడగా 13 మ్యాచుల్లో గెలుపొందింది. 6 మ్యాచుల్లో ఓడిపోయింది. వాస్తవానికి ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక్క విజయానికి 10 పాయింట్లు వస్తాయి. ఆ లెక్కన భారత్ ఖాతాలో 130 పాయింట్లు ఉండాలి. అయితే.. 129 మాత్రమే ఉండడానికి కారణం పెనాల్టీ ఓవర్. నిబంధనల ప్రకారం ఎన్ని పెనాల్టీ ఓవర్లు వేస్తే అన్ని పాయింట్లను తీసివేస్తారు.
ఇక కివీస్ ఇప్పటి వరకు 16 మ్యాచులు ఆడగా 12 మ్యాచుల్లో విజయం సాధించింది. నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది. దీంతో కివీస్ ఖాతాలో 120 పాయింట్లు ఉన్నాయి. ఒక వేళ రేపటి(ఆదివారం) మ్యాచ్‌లో విజయం సాధిస్తే అప్పుడు న్యూజిలాండ్ 130 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంటుంది. టీమ్ఇండియా రెండో స్థానానికి పడిపోతుంది.
ఐసీసీ నిబంధనల ప్రకారం తొలి 8 స్థానాల్లో నిలిచిన జట్లు భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2023కి నేరుగా అర్హత సాధిస్తాయి. ఈ ప్రపంచకప్ లో మొత్తం 13 జట్లు బరిలో ఉండనున్నాయి. మిగిలిన ఐదు జట్లు క్వాలిఫైయిర్ టోర్నీల ద్వారా రానున్నాయి. టీమ్ఇండియా, న్యూజిలాండ్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. ఇంగ్లాండ్ (125 పాయింట్లు), ఆస్ట్రేలియా (120), బంగ్లాదేశ్ (120), పాకిస్థాన్ (120), అఫ్గానిస్థాన్ (110), వెస్టిండీస్ (88) ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
మిగిలిన జట్ల పరిస్థితి ఎలాగున్నా.. అతిథ్య హోదాలో మాత్రం భారత జట్టు నేరుగా ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధిస్తుంది.