IND vs BAN 2nd Test : వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోయిన టీమ్ఇండియా టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు విజయం సాధించింది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఓవర్ నైట్ స్కోర్ 45/4 తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్ కు బంగ్లా బౌలర్లు షాకిచ్చారు. ఆట ప్రారంభమైన కాసేపటికే స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు తీశారు. దీంతో భారత జట్టు 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత అభిమానుల్లో కలవరం మొదలు కాగా.. బంగ్లా ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. ఈ దశలో బంగ్లా బౌలర్ల ఊపు చూస్తే ఖచ్చితంగా ఆ జట్టే గెలుస్తుందని అనిపించింది.
అయితే.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(29), సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్(42) లు సమయోచితంగా ఆడారు. ముఖ్యంగా అశ్విన్ తన అనుభవాన్ని అంతా ఉపయోగించి ఒత్తిడిని అధిగమిస్తూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు బంగ్లా బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఆడితూచి ఆడుతూ 8వ వికెట్‌కు అబేధ్యంగా 71 పరుగులు జోడించారు. అయ్యర్ క్రీజులో నిలదొక్కుకోగా, అశ్విన్ వీలు చిక్కనప్పుడల్లా బౌండరీలు బాదుతూ భారత్‌కు విజయాన్ని అందించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మిరాజ్ 5 వికెట్లు తీయగా, షకీబ్ 2 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు, పుజారాకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 227కు ఆలౌట్ కాగా.. టీమ్ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 314 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియాకు లభించిన 87 పరుగుల ఆధిక్యాన్ని తీసివేయగా 145 పరుగుల లక్ష్యం నిలిచింది.