భారత్–పాక్ మధ్య తలెత్తిన యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిచిపోయిన ఐపీఎల్‌కు తిరిగి ప్రారంభమయ్యేలా కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో.. మిగిలిన మ్యాచ్‌లను త్వరగా పూర్తి చేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పునరాలోచనలో పడింది. కేంద్ర ప్రభుత్వం అనుమతినిస్తే ఈ వారాంతం నుంచే టోర్నమెంట్ తిరిగి ప్రారంభం కానుందని బీసీసీఐ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. మే 15 నుంచే మళ్లీ మ్యాచ్ లు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అంతకుముందు షెడ్యూల్ ప్రకారం మే 25లోపే టోర్నమెంట్ ముగించాలని బీసీసీఐ సంకల్పించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా మ్యాచ్‌లను త్వరితగతిన నిర్వహించే యోచనలో ఉన్నామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. ఈ మేరకు నేడు నిర్వహించే అత్యవసర సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటివరకు 2025 ఐపీఎల్‌లో 57 మ్యాచ్‌లు పూర్తి కాగా, ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్–ఢిల్లీ మధ్య 58వ మ్యాచ్‌ను ఆపివేశారు. ఈ మ్యాచ్‌ను మళ్లీ ఆడించాలా లేక రెండు జట్లకు చెరో పాయింట్ ఇవ్వాలా అనే దానిపై ఇంకా నిర్ణయం రాలేదు. మరో 12 లీగ్ మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్ మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో నిర్వాహకులు కొత్త షెడ్యూల్ పై కార్యాచరణ ప్రారంభించారు.
సురక్షితంగా మ్యాచ్‌లను నిర్వహించేందుకు దక్షిణాది నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలను ప్రధాన వేదికలుగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే రెండు ప్లే ఆఫ్స్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా, మిగతా మ్యాచ్‌లకూ ఇవే స్టేడియాలు ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే తాజా సవాళ్లలో ముఖ్యమైనది – విదేశీ ఆటగాళ్ల హాజరు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే స్వదేశాలకు వెళ్లిన పలువురు విదేశీ క్రికెటర్లను తిరిగి తీసుకురావడం టీములకు సవాలుగా మారింది. ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లు, సిబ్బంది తిరిగి రావాలని ఏర్పాట్లు ప్రారంభించాయని సమాచారం. అయితే అంతా కేంద్రం అనుమతిపైనే ఆధారపడి ఉంది.