India vs England 2025 Test Series Breaks Records: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సంచలనం సృష్టించింది. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో అత్యధిక మంది వీక్షించిన టెస్టు సిరీస్ గా రికార్డులను తిరగరాసింది. ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను జియోహాట్‌స్టార్‌లో 17 కోట్ల మంది తిలకించారు. ఇది ఏ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనైనా అత్యధికంగా వీక్షించబడిన టెస్ట్ సిరీస్‌గా చరిత్రకెక్కింది. ఓవల్‌లో జరిగిన ఐదవ టెస్ట్ చివరి రోజు ఏకకాలంలో రికార్డు స్థాయిలో 1.3 కోట్ల మంది వీక్షించారు. సిరీస్ మెుత్తం 65 బిలియన్ మినట్స్ వాచ్ టైమ్ ను నమోదు చేసింది. కాగా ఈ సిరీస్ 2-2తో సమమైన సంగతి తెలిసిందే.
ఎన్నో అంచనాల మధ్య భారత జట్టు ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్ లో అడుగుపెట్టింది. లీడ్స్‌లోని హెడింగ్లీలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. బ్యాటర్లు బాగా ఆడినప్పటికీ ఫీల్డర్లు కొంపముంచారు. బౌలింగ్ లో బుమ్రా ఐదు వికెట్లతో సత్తా చాటాడు. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో గిల్ సేన అద్భుతంగా ఆడి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. అంతేకాకుడా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో బ్యాటర్లు వైఫల్యం వల్ల 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక..22 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Also Read: Asia Cup 2025- గుడ్ న్యూస్.. ఆసియా కప్ స్వ్కాడ్‌లో జస్ప్రీత్ బుమ్రా?
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన నాలుగో టెస్టులో భారత ఆటగాళ్లు అద్భుతంగా పోరాడి మ్యాచ్ ను డ్రాగా ముగించారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీలతో చెలరేగి ఇంగ్లండ్ కు విజయాన్ని దక్కకుండా చేశారు. ది ఓవల్‌లో జరిగిన చివరి టెస్ట్ ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు జట్లు కోదమ సింహాల్లా తలపడ్డాయి. విజయం ఇంగ్లాండ్ దే అంతా అనుకున్న సమయంలో భారత బౌలర్లు చెలరేగి జట్టుకు గెలుపును అందించారు. గిల్ సేన అతిథ్యజట్టును కేవలం ఆరు పరుగుల తేడాతో ఓడించింది. కెప్టెన్ గా గిల్ కు ఇదే తొలిసారి. అయితే సారథిగా, బ్యాటర్ గా అద్భుతంగా రాణించి అందరి ప్రశంసలను అందుకున్నడు.


