ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. హై ఓల్టేజ్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి. టీమిండియా తన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై విక్టరీ సాధించి.. దాయాదితో పోరుకు సిద్ధమైంది. మరోవైపు పాక్ తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. దీంతో పాకిస్తాన్ కు ఈ మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్ గా మారింది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక భారత్, పాకిస్తాన్ జట్లు కేవలం ఐసీసీ ట్రోఫీలో మాత్రమే తలపడుతున్నాయి. దీంతో 8 నెలల తర్వాత ఈ రెండు జట్లు పోటీ పడుతున్నాయి.
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఎదురైన ఓటమికి.. భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. దీనితో పాటు సెమీఫైనల్స్ అవకాశాలను మరింత బలోపేతం చేసుకోవాలని రోహిత్ సేన చూస్తోంది. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు రాణించారు. షమీ ఐదు వికెట్లు తీసి ఫామ్ లోకి వచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ధాటిగా ఆడుతున్నాడు. అయితే కోహ్లీ ఫామ్ టీమిండియాను కలవరపెడుతోంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ జరిగే దుబాయ్ స్టేడియం పిచ్ పరిస్థితి ఎలా ఉంటుంది.. పిచ్ ఫాస్ట్ బౌలర్లకు లేదా స్పిన్నర్లకు సహకరిస్తుందా.. ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్ సాధారణంగా స్లో ట్రాక్‌గా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ సులభం కాదు. కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లకు సహాయపడుతుంది. మ్యాచ్ ప్రారంభంలో మహమ్మద్ షమీ మరియు హర్షిత్ రాణా ఈ పిచ్‌ను పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. గత మ్యాచ్‌లో షమీ 5 వికెట్లు, రాణా 3 వికెట్లు పడగొట్టారు. మరోవైపు.. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
ఇక ఈ గ్రౌండ్ లో మొత్తం 59 మ్యాచ్‌లు జరగగా.. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 22 సార్లు.. ఛేజింగ్ జట్టు 35 సార్లు విజయం సాధించింది. దీంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. పాక్ బౌలర్లలో నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, హరిస్ రౌఫ్ దుబాయ్ పిచ్ ను వినియోగిస్తే టీమిండియాకు ఇబ్బందులు తప్పవు. వాతావరణ రిపోర్ట్ చూస్తే.. మ్యాచ్ జరిగే రోజు వర్షం పడే అవకాశం లేదు.. అయితే సాయంత్రం వేళ మంచు కురిసే వకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వన్డే ఫార్మాట్‌లో పాకిస్తాన్, ఇండియా ఇప్పటివరకు 153 సార్లు తలపడ్డాయి. ఈ మ్యాచుల్లో పాకిస్తాన్ 73 సార్లు భారత్‌ను ఓడించగా.. భారత్ 57 సార్లు విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి. ఇరు జట్ల మధ్య జరిగిన వన్డేలో చివరిసారిగా అక్టోబర్ 14, 2023న అహ్మదాబాద్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.