Divya Deshmukh Creates History: భారత యువ చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ చరిత్ర సృష్టించింది. ఫిడే మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుని అరుదైన ఘనతను సాధించింది. సెమీస్ లో చైనాకు చెందిన మాజీ వరల్డ్ ఛాంపియన్ తాన్ ఝోంగీని 1.5-0.5 తేడాతో దివ్య ఓడించింది. దీంతో ఈ టోర్నమెంట్ చరిత్రలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళగా దివ్య దేశ్‌ముఖ్ నిలిచింది.
తాజా విజయంతో ఈమె తన మొదటి గ్రాండ్ మాస్టర్ (జీఎం) నార్మ్‌ను కూడా సాధించింది. సెమీస్ లో తెల్లపావులతో ఆడిన దివ్య అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. దీంతో ఈమె 2026 మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌కు కూడా అర్హత సాధించింది. 19 ఏళ్ల దివ్య స్వస్థలం మహారాష్ట్ర.
ప్రపంచ 18వ ర్యాంకర్ అయిన దివ్య మంగళవారం జరిగిన మెుదటి గేమ్ ను నల్లపావులతో ఆడి డ్రా చేసుకుంది. అయితే బుధవారం జరిగిన రెండో గేమ్‌లో మాత్రం తెల్లపావులతో ఆడటం కలిసొచ్చింది. మిడ్ గేమ్ లో తాన్ ఝోంగీ చేసిన తప్పులను తనకు అనుకూలంగా మార్చుకుని గెలిచింది. ప్రత్యర్థిని 101 ఎత్తుల్లో ఓడించిన దివ్య.. ఫైనల్‌కి అర్హత సాధించింది. మరో సెమీపైనల్లో కోనేరు హంప, లీ టింగ్ జి వరుసగా రెండో గేమ్ ను డ్రాగా ముగించారు. వీళ్లు గురువారం జరిగే టైబ్రేక్ లో తలపడనున్నారు. ఇందులో గెలిచిన వారితో దివ్య దేశ్‌ముఖ్ ఫైనల్ ఆడుతోంది.


