ఐపీఎల్(IPL 2025) 18వ సీజన్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టోర్నీ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ(BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ మ్యాచ్‌లను వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాయని పేర్కొంది. దీనిపై ఐపీఎల్ పాలక మండలిలో చర్చించామని.. బ్రాడ్ కాస్టర్స్, స్పాన్సరర్లు, అభిమానుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని తెలిపింది.
సాయుధ బలగాల స్థైర్యం, సన్నద్ధతపై పూర్తి విశ్వాసం ఉన్నప్పటికీ.. అందరి అభిప్రాయాలను గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి బీసీసీఐ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని వెల్లడించింది. ఓవైపు దేశం యుద్ధం చేస్తుంటే.. మరోవైపు క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం సరైంది కాదనిపించిందని టోర్నీ నిర్వాహకులు తెలిపారు. కాగా ప్రస్తుత సీజన్‌లో ఇంకా 12 లీగ్ మ్యాచులు ఉన్నాయి. రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ మిగిలి ఉంది. షెడ్యూల్ ప్రకారం మే 25న కోల్‌కతా వేదికగా ఐపీఎల్ ఫైనల్ జరగాల్సి ఉంది.