ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్‌లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer) ఒకరు. ఐపీఎల్ మెగా వేలం ముందు రిటెన్షన్‌లో భాగంగా వెంకటేశ్ అయ్యర్‌ను కేకేఆర్ రూ.23.75 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే తొలి మూడు మ్యాచుల్లో విఫలమైన వెంకటేశ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జరిగిన మ్యాచులో రెచ్చిపోయాడు. కేవలం కేవలం 29 బంతుల్లోనే 60 పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘‘ఒక్కసారి ఐపీఎల్ మ్యాచులు ప్రారంభమైతే.. ప్లేయర్ అమ్ముడైంది రూ.20 లక్షలకా? రూ.20 కోట్లకా?అనేది అవసరం లేదు. ఇక్కడ డబ్బు మన ఆటను నిర్దేశించదు. మా జట్టులో రఘువంశీ యువ క్రికెటర్.. అద్భుతంగా ఆడాడు. ఇక్కడే హై పేమెంట్, అంచనాలపై ప్రశ్నలు వస్తాయి. అయితే నేను జట్టు విజయంలో ఎప్పుడూ భాగస్వామ్యం అయ్యేందుకు ప్రయత్నించే క్రికెటర్‌ను. కొన్ని బంతులే ఉన్నప్పుడు దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తా. నా జట్టు కోసం ఏదైనా చేస్తా. అత్యధిక మొత్తం అందుకొనే క్రికెటర్‌నైనా ప్రతి మ్యాచ్‌లోనూ పరుగులు చేయాలని దానర్థం కాదు. ఐపీఎల్ మ్యాచ్ అంటేనే ఒత్తిడి ఉంటుంది. జట్టు విజయం కోసం ఏం చేశామనేదే కీలకం. అందులో నేనెప్పుడూ వెనకడుగు వేయను’’ అని వెంకటేశ్ తెలిపాడు.