KL Rahul : బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమ్ఇండియాను శ్రేయస్, అశ్విన్ జంట ఆదుకుంది. ఎనిమిదో వికెట్‌కు 71 పరుగుల అభేధ్యమైన భాగస్వామ్యాన్ని నిర్మించి జట్టును విజయ తీరాలకు చేర్చింది. అయితే.. వికెట్లు కోల్పోయిన సమయంలో జట్టులో టెన్షన్ వాతావరణం నెలకొని ఉందని మ్యాచ్ అనంతరం కెప్టెన్ రాహుల్ తెలిపాడు.
“నిజం చెప్పాలంటే మిడిల్ ఆర్డర్‌పై చాలా నమ్మకం ఉంది. తప్పకుండా మ్యాచ్‌ను గెలిపిస్తారని అనుకున్నాం. అయితే మ్యాచ్ జరిగే కొద్ది డ్రెస్సింగ్ రూమ్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్కరు ఒత్తిడికి గురైయ్యారు. ఈ వికెట్‌పై బ్యాటింగ్ చేయడం కాస్త కష్టమైన పని. బంగ్లా బౌలర్లు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఈ పిచ్‌పై కొత్త బంతిని ఎదుర్కొనడం కష్టం. బంతి పాతబడే కొద్ది పరుగులు రాబట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇక చేధనలో మేం అనుకున్న దానికంటే ఎక్కువ వికెట్లు కోల్పోయాం. అయితే.. చివరికి మ్యాచ్ గెలవడం ఎంతో ఆనందంగా ఉందని” రాహుల్ అన్నాడు.
బంగ్లా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా కుల్దీప్ యాదవ్ లేని లోటు స్పష్టంగా కనిపించిందని చెప్పాడు. తొలి రోజు పిచ్‌ను గమనిస్తే స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా అనిపించిందని అందుకే కుల్దీప్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఫాస్ట్ బౌలర్లు ఎక్కువ వికెట్లు తీసిన విషయాన్ని మరిచిపోవద్దని చెప్పాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ప్రవేశ పెట్టనున్న కొత్త రూల్ “ఇంపాక్ట్ ప్లేయర్” టెస్టుల్లో ఉండి ఉంటే ఖచ్చితంగా దీన్ని వాడుకుని బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో కుల్దీప్‌ను తీసుకువచ్చేవాడినని రాహుల్ అన్నాడు.
తొలి టెస్టులో 8 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి “ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్” అందుకున్న కుల్దీప్ యాదవ్ ను రెండో టెస్టుకు పక్కన పెట్టడం పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.