కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తన సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పై ఘన విజయం సాధించింది. 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ పూర్తిగా విఫలమై, 16.4 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా కోల్‌కతా 80 పరుగుల తేడాతో విజయాన్ని ఖాయం చేసుకుంది.
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు, ఓపెనర్లు త్వరగానే పెవిలియన్‌కు చేరడంతో కొంత ఒత్తిడికి గురైంది. కానీ ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాటర్లు రాణించడంతో జట్టు పునరుద్ధరించుకుంది. ఓ దశలో 150 పరుగుల స్కోరు కూడా దాటదనుకున్న ఆ జట్టు.. చివరి ఐదు ఓవర్లలో 78 పరుగులు చేయడంతో 200 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వెంకటేశ్ అయ్యర్ 29 బంతుల్లో 60 పరుగులతో అర్ధశతకాన్ని పూర్తి చేసి జట్టుకు ఊతమిచ్చాడు. అంగ్క్రిష్ రఘువంశీ కూడా 32 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. రింకు సింగ్ 17 బంతుల్లో 32 పరుగులతో చివర్లో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ ముగ్గురు బ్యాటర్ల దూకుడు వల్ల KKR 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.
ఇక 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన SRH జట్టుకు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి బంతికే ట్రావిస్ హెడ్ ఫోర్ కొట్టినా, వెంటనే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరుసటి ఓవర్‌లోనే అభిషేక్ శర్మ కూడా అవుట్ కావడంతో SRH కష్టాల్లో పడింది. కీ ప్లేయర్లు ఎవ్వరూ నిలదొక్కుకోలేకపోయారు. ఇషాన్ కిషన్ కేవలం 2 పరుగులకే అవుట్ అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి 19 పరుగులు పరుగులకే వెనుదిరిగాడు. కమిండు మెండిస్, అనికేత్ వర్మ కూడా తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యారు.
ఒక్క హెన్రిచ్ క్లాసెన్ మాత్రమే కాస్త పోరాడాడు. అతను 21 బంతుల్లో 33 పరుగులు చేసి, SRH గౌరవప్రదమైన స్కోర్ సాధించే ప్రయత్నం చేశాడు. కానీ అతను ఔటయ్యాక జట్టు పూర్తిగా కుప్పకూలింది. పాట్ కమ్మిన్స్ 14 పరుగులు చేసినా, దానికి సరైన మద్దతు లభించలేదు.ఈ ఓటమితో SRH వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది. మార్చి 30న ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి, మార్చి 27న లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమి తర్వాత, ఇప్పుడు కోల్‌కతా చేతిలో 80 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఈ ఓటమితో SRH ఆటతీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమవడం, బౌలింగ్‌లో చివరి ఓవర్లలో పరుగులు ఎక్కువగా ఇవ్వడం SRH జట్టును కష్టాల్లో పడేసింది. మరోవైపు, KKR జట్టు సత్తా చాటుతూ పాయింట్ల పట్టికలో మరింత మెరుగైన స్థితిని అందుకుంది.