IND vs BAN 1st Test : చటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు పట్టుబిగించింది. కుల్‌దీప్ యాదవ్(5/40) ఐదు వికెట్లతో విజృంభించడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో 254 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
ఓవర్ నైట్ స్కోర్ 133/8 స్కోర్‌తో మూడో రోజు ఆటను ఆరంభించిన బంగ్లా మరో 17 పరుగులు జత చేసి మిగిలిన రెండు వికెట్లు కోల్పోయింది. ఎబాడట్(17)ను కుల్దీప్ ఔట్ చేయగా హసన్ మిరాజ్(25)ను అక్షర్ పటేల్ పెవిలియన్‌కు చేర్చడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో కుల్దీప్ ఐదు వికెట్లు పడగొట్టగా, సిరాజ్ మూడు, ఉమేశ్‌యాదవ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.
బంగ్లాదేశ్‌ను ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నప్పటికీ భారత్ ఆ పని చేయలేదు. మరోసారి బ్యాటింగ్ చేసేందుకే కెప్టెన్ కేఎల్ రాహుల్ మొగ్గు చూపాడు. దీంతో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేసి భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే అవకాశం ఉంది.