ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో 16వ మ్యాచ్‌గా లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ముంబై ఇండియన్స్ (MI) జట్లు శుక్రవారం తలపడనున్నాయి. ఏప్రిల్ 4న రాత్రి 7:30 గంటలకు లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజపేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ రెండు జట్లు ఒక్కొక్క విజయాన్ని మాత్రమే నమోదు చేయగా, కీలకమైన ఈ మ్యాచ్‌పై జట్లు భారీ ఆశలే పెట్టుకున్నాయి.
LSG తమ హోమ్ గ్రౌండ్‌లో ఆడుతున్న నేపథ్యంలో ఆ టీమ్ కి ప్రేక్షకుల మద్దతు, స్థానిక పిచ్ పరిజ్ఞానం జట్టుకు ఉపయోగపడే అవకాశం ఉంది. రిషభ్ పంత్ నాయకత్వంలోని లక్నో జట్టులో నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బడోనీ వంటి శక్తివంతమైన బ్యాట్స్‌మెన్‌లు ఉండగా, బౌలింగ్‌లో రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్ కీలకంగా ఉన్నారు. అయితే గత మ్యాచ్‌లలో మిడిల్ ఓవర్లలో జట్టు ఒత్తిడికి లోనవ్వడం, నిలకడగా ఆడలేకపోవడం ఆ జట్టుకు ప్రధానమైన లోపంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్‌లో.. ఇప్పటి వరకూ తమ స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయింది. వారి అనుభవం, స్టార్ ఆటగాళ్ల సామర్థ్యం ఏ వేళకైనా మ్యాచ్‌కు మలుపు తిప్పగలదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలో జట్టులో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి అనుభవజ్ఞులు ఉన్నారు. బౌలింగ్ విభాగం కూడా పరవాలేదనిపిస్తోంది. అయితే రోహిత్ ఫామ్‌లో లేకపోవడం.. జట్టులో ఇతర ఆటగాళ్లు నిలకడగా రాణించకపోవడం MI ముందు ఉన్న సవాళ్లుగా నిలిచాయి.
ఈ మ్యాచ్‌కు వేదికైన ఎకానా స్టేడియంలో చేజింగ్‌కు అనుకూలమైన పిచ్ ఉంది. ఇక్కడ జరిగిన గత 6 మ్యాచ్‌ల్లో 5 సార్లు రెండో బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించడంతో, టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. వాతావరణం సాధారణంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. దీంతో క్రికెట్ అభిమానులు అయితే ఉత్కంఠభరిత పోరుకు సిద్ధమవుతున్నారు.