IND VS ENG 4th Test Highlights: ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా అద్భుతంగా పోరాడి మ్యాచ్ ను డ్రాగా ముగించింది. ఐదో రోజు ఆటలో గిల్ తోపాటు జడేజా, సుందర్ సెంచరీలు చేయడం విశేషం. ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఐదు టెస్టుల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఇంగ్లండ్ 2-1తో లీడ్ లో ఉంది. చివరి టెస్టు ఓవల్ వేదికగా జూలై 31న ప్రారంభం కానుంది.
గిల్ రికార్డు సెంచరీ..
ఓవర్ నైట్ స్కోరు 174/2తో ఐదో రోజు ఆట కొనసాగించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ రాహుల్ (90)ను అద్భుత బంతితో స్టోక్స్ ఎల్బీగా ఔట్ చేశాడు. అనంతరం గిల్ కు జతకలిసిన సుందర్ ఆచితూచి ఆడారు. ఈ క్రమంలో గిల్ సెంచరీ చేశాడు. అయితే లంచ్ కు ముందు ఆర్చర్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు గిల్. ఇంగ్లండ్ పై ఒక సిరీస్ లో 700 పరుగులు చేసిన ఆసియన్ బ్యాటర్ గా నిలిచాడు.
Also read: Nitish Kumar Reddy – నేను ఎక్కడికి వెళ్లను.. ఇక్కడే ఉంటా
జడ్డూ, సుందర్ సెంచరీలు
నాలుగు వికెట్లు కోల్పోవడం, పంత్ గాయంతో బ్యాటింగ్ రాకపోవడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఈ టైంలో సుందర్ కు జతకలిసిన జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ ఇంగ్లీష్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. వికెట్ ను కాపాడుకుంటూ స్వేచ్ఛగా బ్యాట్ ఝలిపించారు. ఈ క్రమంలో సిరీస్ లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఇది అతని టెస్ట్ కెరీర్‌లో ఐదో సెంచరీ. మరోవైపు సుందర్ కూడా తొలి టెస్టు సెంచరీ సాధించాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 335 బంతుల్లో 203 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. మరో పది ఓవర్లు ఉండగానే ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ రెండు వికెట్లు తీశాడు.
స్కోరు వివరాలు:
ఇండియా తొలి ఇన్నింగ్స్ – 358/10
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్- 669/10
ఇండియా రెండో ఇన్నింగ్స్- 425/4


