సౌతాఫ్రికా క్రికెట్ లీగ్(SA20 2025) కొత్త ఛాంపియన్‌గా ముంబై ఇండియన్స్ కేప్ టౌన్(MI కేప్ టౌన్) అవతరించింది. వాండరర్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ జట్టును చిత్తుగా ఓడించింది. ఈ సీజన్ మొత్తం అదరగొట్టిన MI కేప్ టౌన్ జట్టు తొలిసారి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఇక ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు చేరిన సన్ రైజర్స్.. ఈసారి మాత్రం నిరాశపరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేప్ టౌన్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. అనంతరం 182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ కేవలం 18.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో కేప్ టౌన్ విన్నర్‌గా నిలిచింది.
ఛాంపియన్‌గా నిలిచిన MI కేప్ టౌన్ జట్టు 34 మిలియన్ ర్యాండ్లు(సుమారు 16.2 కోట్ల రూపాయలు) గ్రాండ్ ప్రైజ్ మనీ గెలుచుకుంది. ఇక రన్నరప్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు 16.25 మిలియన్ ర్యాండ్లు (సుమారు 7.75 కోట్ల రూపాయలు) దక్కించుకుంది. కాగా ఈ విజయంతో ఇప్పటివరకు MI ఫ్రాంచైజీ మొత్తం ఐపీఎల్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, మేజర్ లీగ్ క్రికెట్, ఇంటర్నేషనల్ లీగ్ టీ20, SA20 లీగ్‌ల్లో కనీసం ఒకసారి ఛాంపియన్‌గా నిలిచింది.