MS Dhoni vs Sampath Kumar: టీమిండియా క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దాఖలు చేసిన రూ. 100 కోట్ల పరువు నష్టం దావా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జి. సంపత్ కుమార్ దాఖలు చేసిన అప్పీల్‌పై మద్రాసు హైకోర్టులో విచారణ పూర్తయింది. ఈ మేరకు న్యాయస్థానం మంగళవారం తన తీర్పును రిజర్వులో ఉంచడంతో ఈ వివాదంలో త్వరలోనే ఓ కొలిక్కి వచ్చేట్లుగా తెలుస్తోంది.
2014లో ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో తన పేరును అనవసరంగా ప్రస్తావించారని ఆరోపిస్తూ ధోనీ మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పటి ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ పైనా, జీ మీడియా కార్పొరేషన్, జర్నలిస్ట్ సుధీర్ చౌదరి, న్యూస్ నేషన్ నెట్‌వర్క్‌లపైనా ధోనీ రూ.100 కోట్ల డిఫమేషన్ లా సూట్ ఫైల్ చేశాడు. కాగా, 2021లో ఈ దావాను కొట్టివేయాలని కోరుతూ సంపత్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సంపత్ కుమార్ పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన హైకోర్టు.. దావా వేసిన ఏడేళ్ల తర్వాత, విచారణ ప్రారంభమయ్యే ముందు ఈ పిటిషన్ వేయడాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు సింగిల్ జడ్జి జస్టిస్ ఎన్. శేషసాయి, 2021 డిసెంబర్ 9న పిటిషన్‌ను కొట్టివేశారు. న్యాయ ప్రక్రియను ఆలస్యం చేసేందుకే ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తున్నారని.. శాఖాపరమైన విచారణలో తనకు క్లీన్‌చిట్ లభించిందన్న వాదన, కేసు విచారణలో ఒక రక్షణగా ఉపయోగపడుతుందే తప్ప, దావాను పూర్తిగా కొట్టివేయడానికి కారణం కాదని జస్టిస్ స్పష్టం చేశారు.
ఈ క్రమంలో, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సంపత్ కుమార్ తాజాగా డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా.. ఈ ఏడాది ఆగస్టు 11న ఈ కేసు విచారణ ప్రారంభమైంది. ఈ మేరకు మంగళవారం ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం.. ఈ అప్పీల్‌పై తుది తీర్పును రిజర్వు చేసింది. దీంతో ఈ వివాదం త్వరలోనే కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది.


