Friday, November 22, 2024
HomeఆటNandyala: జిల్లా స్థాయి చదరంగం పోటీలు ప్రారంభం

Nandyala: జిల్లా స్థాయి చదరంగం పోటీలు ప్రారంభం

ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఆల్ కర్నూల్ చెస్ అసోసియేషన్ నిర్వహణలో నంద్యాల జిల్లా స్థాయి 19 సంవత్సరాలలోపు బాల బాలికలకు చదరంగం పోటీలు ప్రారంభమయ్యాయి. స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఈ చెస్ పోటీలు సాగుతున్నాయి. ఆల్ కర్నూల్ చెస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, రామకృష్ణ కళాశాలల మేనేజర్ ప్రగతి రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చదరంగం పోటీలు తరచూ నంద్యాలలో జరగడం ద్వారా నంద్యాల క్రీడాకారులు జిల్లా, రాష్ట్రస్థాయిలలో విజయాల సాధించడానికి దోహదపడుతున్నదని, అందుకు కృషి చేస్తున్న నిర్వాహకులు రామసుబ్బారెడ్డి తదితరులను అభినందించారు.
డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ గతంలో కర్నూలు, నంద్యాల రెండు జిల్లాలకు కలిపి పోటీలు నిర్వహించే వారమని , ఇప్పుడు మొట్టమొదటిసారిగా ప్రత్యేకంగా నంద్యాల జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడానికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు.
ఆంధ్ర చెస్ అసోసియేషన్ చెస్ క్రీడాకారిణి విశాఖపట్నంకు చెందిన మీనాక్షి రాష్ట్రపతి జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కోటి రూపాయలు తన క్రీడా నైపుణ్యాన్ని పెంచుకోవడానికి శిక్షణ కోసం అందజేశారని, చదరంగంలో ఉన్నత స్థాయి విజయాలు సాధించిన వారికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించడం ప్రశంసనీయమన్నారు.
ప్రగతి రెడ్డి మాట్లాడుతూ చిన్నారులకు చదరంగం ఆడడం ద్వారా గెలుపు ఓటములు స్వీకరించే మానసిక స్థైర్యం ఏర్పడుతుందని, ఓటమి తర్వాత విజయాలు సాధించడానికి ముమ్మరంగా సాధన చేయాలన్న పట్టుదల ఏర్పడుతుందని, అదే మానసిక ధైర్యం చదువులో కూడా చూపించడానికి తద్వారా విద్యలో కూడా ఉన్నత స్థాయిలో రాణించటానికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News