ఈ ఇద్దరు టీన్స్ ప్రపంచ పవర్ లిఫ్టర్స్..
పవర్ లిఫ్టింగ్ లో ప్రపంచ విజేతలుగా పిన్నవయసులోనే నిలబడి ఎందరో అమ్మాయిలకు స్పూర్తిగా నిలిచారు కాషా సచిదేవ్, నోయా యప్పన్ లు. పురుషాధిక్య క్రీడలో అమ్మాయిలేం తక్కువ కాదని ‘పవర్ ఫుల్’గా నిరూపించారు. ఆ విశేషాలు..
ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు టీన్ పవర్ లిఫ్టర్స్. స్టిరియోటైప్ కి మేం భిన్నం అని ఈ ఇద్దరూ నిరూపించారు. అబ్బాయిలు యేలే పవర్ లిఫ్టింగ్ క్రీడలో బంగారుపతకాలను కైవశం చేసుకుని ఎందరో అమ్మాయిలకు ‘విభిన్నమైన’ రోల్ మోడల్స్ గా నిలిచారు. వాళ్లే నోయ యప్పన్, కాషా సచిదేవ్ లు. నోయ వయసు 13 సంవత్సరాలు, కాషా వయసు 15 ఏళ్లు. అందరు యువతీ యువకుల్లా వీళ్లు తమ టీనేజ్ ని ఎంజాయ్మెంట్లతో గడపలేదు. జీవితానికి ఒక ధ్యేయం పెట్టుకున్నారు. నేటి యువతీ యువకులందరికన్నా తాము విభిన్నం అని నిరూపించారు. ఎందరో యువతీయువకులకు మల్లే ఇన్ స్టా, ఫేస్ బుక్ లలో వీళ్లు మునిగిపోలేదు. పురుషాధిపత్య రంగమైన పవర్ లిఫ్టింగ్ లో అంతర్జాతీయస్థాయిలో బంగారు పతకాలను కైవశం చేసుకున్నారు.
కిర్గిజ్ స్తాన్ లో జరిగిన వరల్డ్ పవర్ లిప్టింగ్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకాలను సాధించి విజయ దరహాసంతో స్వదేశానికి తిరిగి వచ్చారు. కాషా బంగారు పతకంతో పాటు ఆడవాళ్ల 75 కేజీల విభాగంలో ప్రపంచరికార్డును నెలకొల్పిన తొలి టీన్ గా చరిత్రకెక్కింది. నోవా కూడా బంగారు పతకం సాధించడంతో పాటు టీన్ కేటగిరిలో ఆడవాళ్ల 60 కేజీల పవర్ లిఫ్టింగ్ విభాగంలో రికార్డు స్రుష్టించింది. పవర్ లిఫ్టింగ్ బలానికి సంబంధించి క్రీడ. స్ట్రెగ్త్ స్పోర్టు. ఇందులో త్రీ లిప్ట్స్ వెయిట్, స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్ వంటివి ఉంటాయి. కాషా సచిదేవ్ తండ్రి నిఖోలాయ్ సచిదేవ్ పవర్ లిఫ్టర్, కోచ్ కూడా. ఆయన బెంచ్ ప్ర్రెస్ లో బంగారు పతక గ్రహీత. డెడ్ లిఫ్ట్ లో రజత పతక గ్రహీత. ఆయన ఎందరో అమ్మాయిలకు పవర్ లిప్టింగ్ లో శిక్షణ ఇస్తారు కూడా. ఇకపోతే నోయా యప్పన్ తండ్రి రిజ్ యప్పన్ లగ్జరీ లైఫ్ స్టైల్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్. కాషా పవర్ లిఫ్టింగ్ ప్రయాణం ఎనిమిదేళ్ల ప్రాయంలో ప్రారంభమైంది.
కాషా మోకాలు బలహీనంగా ఉంటే దానికి సర్జరీ చేయించుకుంది. ఆమె సమస్యను ‘నాక్ ని కండిషన్’ (మోకాలు బలహీనంగా ఉండి) అంటారు. ఇది ఇబ్బందికరమైన కండిషన్. మోకాలు సర్జరీ వల్ల కాలిపై ఏర్పడ్డ మచ్చలు చూసిన చాలామంది ‘కాలుకు ఏదైనా సమస్య ఉందా?’ అంటూ కాషాను అడిగేవారట. ఆమె పాదం సరిగా ఉండేది కాదు. కాళ్లు సరైన ఆక్రుతిలో ఉండేందుకు గాను కాషా నిత్యం వ్యాయామాలు చేసేది. కానీ ఆమె మోకాలు పరిస్థితిలో గానీ, కాలు మణికట్టు దగ్గరగానీ ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. ఆ క్రమంలోనే కాషా తండ్రి కూతురు పరిస్థితి మీద పెద్ద అధ్యయనమే చేసారు. అందులో భాగంగా ఆయన కూతురును ఒక జిమ్ లో చేర్చారు. అక్కడ వర్కవుట్స్ చేస్తున్న కొద్దీ కాషా కాస్త బెటర్ గా అవడం మొదలెట్టింది. కాషా తండ్రి పవర్ లిఫ్టర్ కూడా అవడంతో కూతురుకు అందులో కూడా ట్రైనింగ్ ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేశారు. ఆ ప్రయత్నంలోనే మోకాలుపై ఆయన ద్రుష్టిపెట్టారు. అలా కాలు మెరుగుపడ్డం మొదలైంది. దీని గురించి మాట్లాడుతూ ‘పవర్ లిఫ్టింగ్ నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. దీనివల్ల నా శరీరంలో వస్తున్న మార్పులను కూడా నేను గమనించా. నా శరీరం ఎంత అద్భుతంగా ’వికసిస్తోందో’ నేను అప్పుడు గుర్తించా. అది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది’ అని కాషా చెప్పింది.
పవర్ లిఫ్టింగ్ రంగంలో నోయ ప్రయాణం తొమ్మిదేళ్ల ప్రాయం నుంచి మొదలైంది. నోయ పొట్టిగా ఉండేది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఎందరో వైద్యులకు ఆమెను చూపించారు. వారందరూ నోయను వ్యాయామాలు చేయమని సూచించారు. దీంతో నోయ తల్లి ఆమెను నిత్యం జిమ్ కు తీసుకువెళ్లేది. అక్కడే కాషాను, ఆమె తండ్రి నికలోయ్ సచిదేవ్ ను నోయ కలిసింది. కాషాను చూసి ఎంతో స్పూర్తి పొందింది. అలా నోయ కూడా పవర్ లిఫ్టింగ్ లో చేరింది. ఆ స్పోర్టులో నోయ చూపుతున్న శక్తి సామర్థ్యాలను కాషా తండ్రి నికొలోయ్ గమనించారు. దాంతో నోయకు కూడా పవర్ లిఫ్టింగ్ లో ఆయన శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. అలా తన అకుంఠిత దీక్షతో పవర్ లిఫ్టింగ్ స్పోర్టులో నేడు టీన్ వరల్డ్ ఛాంపియన్ గా నోయ నిలిచింది. ‘పవర్ లిఫ్టింగ్ కు, పొడుగు పెరగడానికి మధ్య ఏదైనా సంబంధం ఉందా అని మేం ఎప్పుడూ అనుకుంటుంటాం’ అని కాషా, నోవాలు అంటుంటారు. ‘వెయిట్ ట్రైనింగ్ మీద చాలామందికి చాలా రకాల అపోహలు ఉన్నాయం’ టారు కాషా తండ్రి నొకిలోయ్ సచిదేవ్. ‘ఎక్కువ బరువులు మోస్తే శరీరాన్ని అది పెరిగేలా చేస్తుందని పలు క్లినికల్ ట్రయల్స్ లో చదివాను ’ అని ఆయన చెప్పారు.
శరీరంలోని గ్రోత్ హార్మోన్ కు ఇది సహాయపడుతుందని అంటారాయన. ‘బాగా పరుగు పెడితే పరుగులో వేగం ఎక్కువవుతుంది. జంప్ బాగా చేస్తే ఎక్కువ ఎత్తు జంప్ చేయగలుగుతారు. అలాగే బలహీనమైన మోకాళ్లు ఉన్న కాషా పవర్ లిఫ్టింగ్ చేయడం వల్ల బలం పుంజుకుంది’ అంటారు నికలోయ్ సచిదేవ్. ‘హార్స్ రైడింగ్ క్రీడ వల్ల కూడా గ్రోత్ దెబ్బతింటుంది. కానీ సూక్ష్మస్థాయి మేనేజ్మెంట్ తో కూడిన శిక్షణ ఉంటే ఆ పరిస్థితి ఎదురవదు’ అని సచిదేశ్ అంటారు. నోయ, కాషాలు ఐదు సంవత్సరాలు నిరంతరాయంగా పవర్ లిఫ్టింగ్ లో శిక్షణ తీసుకున్నారు. అన్ని ఏళ్లల్లో వారిద్దరికీ తగిన గాయాలు చాలా కొన్ని మాత్రమే. అలా వీరిద్దరూ పవర్ లిఫ్టింగ్ పై ఉన్న ఎన్నో దురభిప్రాయాలు తప్పని నిరూపించారు కూడా. పెరుగుదల (గ్రోత్)కు, శిక్షణకు మధ్య ఉన్న సంబంధాన్ని కూడా తమ శిక్షణా కాలంలో వీళ్లు గుర్తించారు. పవర్ లిప్టింగ్ వల్ల కాషా పాదాలలో మార్పు వస్తే, నోయ నాలుగు అంగుళాలు పెరిగింది. అలా వారిద్దరి శరీరం కంపోసిషన్ మారింది. చిన్నవయసులోనే ఈ ఇద్దరు టీన్స్ సాధించిన విజయం ఎందరికో వారిని రోల్ మోడల్స్ చేసింది. ఈ క్రమంలో వీరిద్దరు ఎదుర్కొన్న సవాళ్లు కూడా ఎన్నో ఉన్నాయి. పుట్టినరోజు పార్టీలు లాంటి ఎన్నో ఆనందాలను కాషా మిస్ అయింది. నోయ తోటి స్నేహితుల నుంచి ఎన్నో రకాల వెక్కిరింతలను ఎదుర్కొంది.
ప్రారంభంలో పవర్ లిఫ్టింగ్ నేర్చుకుంటున్నప్పుడు తోటి అబ్బాయిలు నోయను గేలిచేసేవారు. అప్పుడు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో నోయకు తెలిసేది కాదు. కానీ ట్రైనింగ్ వల్ల వచ్చిన ఆత్మవిశ్వాసంతో తనేంటో ఎవ్వరికీ నిరూపించుకోవాలసిన అవసరం లేదనే ఆలోచన నోయలో క్రమంగా పెరిగింది. దీంతో పాటు ఎంతో ధైర్యం, ఆత్మవిశ్వాసం కూడా నోయకు వచ్చింది. ఈ క్రమంలో నోయ ఎదుర్కొన్న మరో సమస్య తన బరువును నియంత్రించడం. ‘నేను తినటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి తినాల్సివస్తుండేది. కాలరీలు లెక్కపెట్టుకుని తినాల్సివచ్చేది. అంతేకాదు వెయిట్ ట్రైనింగ్ అయిన తర్వాత మూడు నాలుగు గంటల పాటు కార్డియో చేయాల్సివచ్చేది.ఈ కఠినమైన ట్రైనింగ్ వల్ల ఇతరులతో పోల్చుకునే గుణాన్ని పోగొట్టుకోగలిగాను. నన్ను నేను ఆత్మవిశ్వాసంతో మెలిగేలా తీర్చిదిద్దుకోగలిగాను. అందుకే నేను ఈ రోజు పవర్ లిఫ్టింగ్ లో అంతర్జాతీయంగా విజేతగా నిలబడగలిగాను’ అంటుంది నోయ.
కాషా కూడా ఆ సమయంలో రకరకాల భయాలు ఎదుర్కొంది. ‘ముఖ్యంగా చాలా ఆనందాలు మిస్ అవుతాననే దిగులు, భయం నాలో ఉండేవి. నేను ఎప్పుడూ జిమ్ లో ఉంటే, నా తోటి వాళ్లంతా పార్టీల్లో ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. అథెలెట్ కావాలంటే ఎన్నో వదులుకోవాల్సి ఉంటుంది’ అని కాషా అంటుంది. బహిష్టు సమయాల్లో కూడా కాషా, నోయలు ట్రైనింగ్ కు వెళ్లేవాళ్లు. తలనొప్పి, కాళ్ల నొప్పులతో బాధలు పడుతున్నా కూడా క్రచెస్ తో ట్రైనింగ్ కొనసాగించేవాళ్లు. ఎలాంటి ఎంజాయ్మెంట్లు, పార్టీలు, విందులు, వినోదాలు వారికి లేవు . ఇలా ఎన్నో రకాల సవాళ్లు వారి అతి చిన్న జీవితంలో ఎదురైనా కూడా పవర్ లిప్టింగ్ శిక్షణకు మాత్రం వీరిద్దరూ అస్సలు దూరం కాలేదు. చివరి రెండు సంవత్సరాల్లో వారి శిక్షణ మరింత కఠినంగా ఉండేది. ట్రైనింగ్, తినడం రెండూ కూడా వారికి ఎన్నో సవాళ్లతో కూడుకున్నట్టు ఉండేవి. నోయను కలవాలంటే తండ్రి రిజ్ కు కూడా అపాయింట్మెంట్ దొరికేది కాదంటే వారి పరిస్థితి ఎలా ఉండేదో అర్థం అవుతుంది. నోయకు రోజూ పిజ్జా తినడం అంటే ఎంతో ఇష్టం. కానీ తినకూడదు. అలా ఉండేది వారి శిక్షణా తీరుతెన్నులు… ఆహారపు అలవాట్లు రెండూ. వారి శిక్షణ కఠినమైన క్రమశిక్షణతో కూడుకుని ఉండేది.
‘పవర్ లిఫ్టింగ్ అంటే కదలిక కాదు. అది క్రమశిక్షణను, ధైర్యాన్ని శరీరంలో నింపే శక్తివంతమైన క్రీడ’ అని అంటారు కోచ్ నికొలోయ్ సచిదేవ్. ఈ ఇద్దరు అమ్మాయిలు సాధించిన పతకాలు, స్రుష్టించిన రికార్డులు మనదేశానికి ఎంతో గర్వకారణం. వీరిద్దరూ తమకు నచ్చిన క్రీడను పట్టుదలగా నేర్చుకున్నారు. విజయాన్ని సొంతం చేసుకున్నారు. చిన్న వయసులోనే తమ లక్ష్యం పట్ల ఎంతో నిబద్ధతతో, మరెంతో క్రమశిక్షణతో ఈ టీనేజర్లు వ్యవహరించారు. దానికి తగ్గట్టు తమ ఆడపిల్లల ఆకాంక్షలను వారి తండ్రులు గుర్తించి వారికి అండగా నిలబడ్డారు. ఆడవాళ్లు ఎదులోనైనా పురుషులకు ఏమాత్రం తీసిపోరని ఈ టీన్స్ నిరూపించడమే కాదు నూటికి నూరు శాతం దాన్ని చేసి చూపించారు కూడా. ఇంత చిన్నవయసులోనే ఈ ఇద్దరు టీనేజర్స్ దేశ యువతకు ముఖ్యంగా అమ్మాయిలకు రోల్ మోడల్స్ గా నిలవడం మరింత ఆనందించాల్సిన విషయం…. ‘మా నాన్నలు మాకెంతో అండగా నిలబడ్డారు. మమ్మల్ని పోత్సహించారు. మమ్మల్ని పురుషాధిక్య క్రీడ అయిన పవర్ లిఫ్టింగ్ లో విజేతలను చేశారు. ఎందరిలోనో స్ఫూర్తి నింపేట్టు మమ్మల్ని తీర్చిదిద్దారు. అంతర్జాతీయంగా విజేతలుగా నిలబెట్టారు’ అంటారు కాషా, నోయలు చిరునవ్వులు చిందిస్తూ…నిజమే కదా… హేట్సాఫ్ టు యు టీన్ పవర్ లిఫ్టర్స్…