ఛాంపియన్స్ ట్రోఫీ 2025(Champions Trophy 2025) మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. 8 దేశాలు ఈ మెగా టోర్నీ బరిలో ఉన్నాయి. పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మొదలయ్యే ఈ మెగా టోర్నీ కప్ కొట్టేందుకు అన్ని జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్(Pat Cummins)స్లెడ్జింగ్‌కు దిగాడు. స్లెడ్జింగ్‌కు ఆసీస్ మారు పేరని తెలిసిందే. అయితే టోర్నీ ప్రారంభంకాక ముందే కమిన్స్ భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Kohli)తో పాటు ఇతర జట్ల స్టార్ క్రికెటర్లను స్లెడ్జింగ్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రమోషన్స్‌లో భాగంగా ఐసీసీ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో కమిన్స్ షేవ్ చేసుకుంటూ కనిపించాడు. ఈ క్రమంలో అతడు పలువురు ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేయాలో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. కోహ్లీ స్ట్రైక్‌రేటును ప్రస్తావిస్తూ ఇంత నిదానంగా బ్యాటింగ్ చేయడాన్ని ఎన్నడూ చూడలేదని ఎద్దేవా చేశాడు. అలాగే ఇంగ్లాండ్ క్రికెటర్లు బెన్ స్టోక్స్, పోప్, దక్షిణాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్‌లను కూడా తనదైన శైలిలో స్లెడ్జ్ చేయడానికి రెడీ అయిపోయాడు.
ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో పాట్ కమిన్స్ ఆడడం సందేహంగానే ఉంది. చీలమండల గాయంతో బాధపడుతున్న కమిన్స్.. పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది.మరో రెండు రోజుల్లో వైద్యులు ఇచ్చే నివేదికపైనే కమిన్స్ ఆడతాడా? లేదా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ అతడు ఆడలేకపోతే స్టీవ్ స్మిత్ లేదా ట్రావిస్ హెడ్‌లలో ఒకరు ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించనున్నారు.