ఐపీఎల్‌లో మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్(PBKS)- కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) మధ్య జరిగిన మ్యాచ్ ఫ్యాన్స్‌కు అసలు సిసలైన మజా అందించింది. బంతి బంతికి మారుతున్న ఆధిపత్యం.. నరాలు తెగే ఉత్కంఠ.. ఇది కదా అసలైన క్రికెట్ మ్యాచ్ అనిపించే కిక్. లోస్కోరింగ్ మ్యాచ్‌లో పంజాబ్ పోరాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ దశలో ఓటమి ఖాయం అనుకున్న మ్యాచ్‌లో పంజాబ్ బలంగా పుంజుకుని గెలవడం చరిత్రలో నిలిచిపోతుంది. ఇలాంటి అద్భుతమైన విజయంపై ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్(Ricky Ponting) స్పందించాడు. ఈ వయసులో తనకు ఇలాంటి హైవోల్టేజ్ మ్యాచ్ అవసరమా అని తెలిపాడు.
‘నా హార్ట్ రేటు పెరిగిందిపోయింది. ఇప్పుడు నాకు 50 ఏళ్లు. ఈ వయసులో ఇలాంటి ఉత్కంఠ మ్యాచ్‌లు చూడాల్సిన అవసరం నాకు లేదు. పిచ్ కష్టంగా ఉంది. దీనిపై బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. చాహల్‌కు గత మ్యాచ్‌లో భుజానికి గాయమైంది. దీంతో మ్యాచ్‌కు ముందు అతడికి ఫిట్‌నెస్ టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో అతడి ప్రదర్శన అద్భుతం. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో మా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల గర్వ పడేవాడని. ఈ మ్యాచ్‌లో మా బ్యాటర్ల ప్రదర్శన బాలేదు. అయితే బౌలర్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఐపీఎల్‌లో ఎన్నో మ్యాచ్‌లకు కోచ్‌గా పని చేశాను. ఈ గెలుపు మాత్రం నాకు ప్రత్యేకంగా నిలిచిపోయింది’ అని చెప్పుకొచ్చాడు.
కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు 15.3 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో కేకేఆర్ జట్టు విఫలమైంది. ఓ దశలో గెలుస్తుందని భావించిన ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి 95 పరుగులకే ఆలౌట్ అయింది.