క్రికెట్‌లో రికార్డులు బద్ధలు కావడం కామనే. జనరేషన్ మారే కొద్దీ రికార్డులు కూడా మారుతూ ఉంటాయి. తాజాగా ఓ రికార్డును ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్(Rashid Khan) బ్రేక్ చేశాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఎస్ఏ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ జట్టు తరపున ఆడుతున్న రషీద్.. పార్ల్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు. దీంతో వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావోను వెనక్కి నెట్టేశాడు.
బ్రావో ఇప్పటివరకు 582 మ్యాచులు ఆడి 631 వికెట్లు తీశాడు. ఇప్పుడు రషీద్.. 633 వికెట్లతో(అంతర్జాతీయ టీ20లు, లీగ్‌లు కలిపి) తొలి స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే రషీద్ ఖాన్ టీ20ల్లో నాలుగు హ్యాట్రిక్‌లు నమోదు చేసిన ఏకైక బౌలర్‌గానూ రికార్డు సృష్టించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL), బిగ్ బాష్ లీగ్ (BBL), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), అఫ్ఘానిస్థాన్ తరఫున ఈ హ్యాట్రిక్‌లు తీశాడు. కాగా ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు రషీద్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడాడు.