ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2025) శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), గుజరాత్ జెయింట్స్ (GG) జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. బెత్ మూనీ (56), ఆష్లే గార్డ్ నర్ (79) రాణించడంతో భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ జట్టు 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఎలీస్ ఫెర్రీ(57), రిచా ఘోష్(64), కనిక (30) పరుగులతో అదరగొట్టడంతో సునాయాసంగా విజయం సాధించింది.
దీంతో ఈ లీగ్‌లో అత్యధిక స్కోరును ఛేదించిన జట్టుగా ఆర్సీబీ రికార్డ్ సృష్టించింది. అంతకుముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ పేరిట ఉంది. 2024లో గుజరాత్ జెయింట్స్ పై 191 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఛేదించింది. ఇప్పుడు కూడా గుజరాత్ జట్టుపైనే బెంగళూరు 202 పరుగులు ఛేదించడం విశేషం. ఇక ఇవాళ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. జియో హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌ను లైవ్‌లో చూడవచ్చు.