Sunday, November 16, 2025
HomeఆటICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా

ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా


ICC Test Rankings update: తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ బ్యాటర్లు అదరగొట్టారు. తమ పాయింట్లను మెరుపరుచుకుని టాప్ ర్యాంకులు దక్కించుకున్నారు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి టెస్టులో సెంచరీలతో అదరగొట్టిన రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్ తమ రేటింగ్ పెంచుకుని మెరుగైన స్థానాల్లో నిలిచారు.

ఓపెనర్ యశస్వి జైస్వాల్ 851 రేటింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచాడు. టీమిండియా వికెట్ కీపర్ పంత్ 801 రేటింగ్‌తో ఒక స్థానం ఎగబాకి ఏడో ప్లేస్‌‌కి చేరుకున్నాడు. దీంతో టీమిండియా తరఫున 800 రేటింగ్ అందుకున్న తొలి వికెట్ కీపర్‌గానూ పంత్ రికార్డ్ నెలకొల్పాడు. ఇక కెప్టెన్ శుభమన్ గిల్ 660 రేటింగ్‌తో ఐదు స్థానాలు ఎగబాకి ప్రస్తుతం 20వ స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్ ఏకంగా పది స్థానాలు ఎగబాకి 579 పాయింట్లతో 38వ స్థానానికి చేరుకున్నాడు.

మరోవైపు ఇంగ్లాండ్ బ్యాటర్లు కూడా సత్తా చాటారు. తొలి రెండు స్థానాల్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఉంటం విశేషం. సీనియర్ ఆటగాడు జో రూట్ 889 రేటింగ్స్‌తో టాప్ ప్లేస్‌లో నిలవగా, హ్యారీ బ్రూక్ 874 రేటింగ్‌తో రెండో స్థానంలో నిలిచాడు. సెంచరీ హీరో బెన్ డకెట్ ఐదు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు.

మొత్తంగా టాప్ టెన్ ర్యాంకుల్లో ఎవరు నిలిచారంటే.. తొలి స్థానంలో 889 రేటింగ్స్‌తో జో రూట్, రెండో స్థానంలో 874 రేటింగ్‌తో హ్యారీ బ్రూక్, మూడో స్థానంలో 867 రేటింగ్‌తో న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్, నాలుగో స్థానంలో 851 రేటింగ్‌తో భారత ఆటగాడు జైస్వాల్, ఐదో స్థానంలో 824 రేటింగ్‌తో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, ఆరో స్థానంలో 806 పాయింట్లతో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా, ఏడో స్థానంలో 801 రేటింగ్‌తో టీమిండియా వైస్ కెప్టెన్ రిషభ్ పంత్, ఎనిమిదో స్థానంలో ఇంగ్లాడ్ ప్లేయర్ బెన్ డకెట్, తొమ్మిదో స్థానంలో శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్, పదో స్థానంలో పాకిస్థాన్ ఆటగాడు సౌద్ షకీల్ ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad