దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా గొప్ప ఆలోచనతో మన యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచడానికి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమే “ఆడుదాం ఆంధ్రా” అని రాష్ట్ర యువజనాభివృద్ధి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి రోజా అభివర్ణించారు. శుక్రవారం విజయవాడ బందర్ రోడ్డులోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, క్రీడాశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, వైఎస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ధ్యాన్ చంద్రతో కలిసి “ఆడుదాం ఆంధ్రా”కు సంబంధించిన కిట్ ను, వీడియోను, కార్యక్రమ వివరాలను తెలిపే బ్రోచర్ ను మంత్రి ఆర్.కే. రోజా విడుదల చేశారు. అనంతరం మంత్రి రోజా “కదిలి ముందుకురా ఆడుదాం ఆంధ్రా” అనే పాట పల్లవిని మీడియా సమావేశంలో స్వయంగా పాడారు.
ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్రా ఇది మన అందరి ఆట.. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ను ఆటల ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు యువత వెన్నంటి ఉంటుందని కోరుకుంటున్నామన్నారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ మరియు ఖోఖో వంటి ఎంపిక చేసిన 5 క్రీడాంశాల్లో గ్రామ/వార్డు, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో 15 డిసెంబర్, 2023 నుండి 3 ఫిబ్రవరి, 2024 వరకు ఈ క్రీడా సంబరాలు కొనసాగుతాయన్నారు. యువతలోని ప్రతిభను వెలికితీసి, వారికి బంగారు భవిష్యత్ ను ఇచ్చేందుకు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అన్ని స్థాయిల్లో కలిపి 50 రోజుల పాటు నిర్వహించే ఈ పోటీల్లో దాదాపు 3 లక్షల మ్యాచ్ లు నిర్వహించనుండటం గర్వంగా ఉందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు కార్యరూపం దాల్చే అవకాశం పొందడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
ఆడుదాం ఆంధ్రా పోటీల్లో గ్రామస్థాయిలో గెలుపొందిన జట్టు మండలం స్థాయికి, మండల స్థాయిలో గెలుపొందిన జట్టు నియోజకవర్గ స్థాయికి, నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన జట్టు జిల్లా స్థాయికి, జిల్లా స్థాయిలో గెలుపొందిన జట్టు రాష్ట్రస్థాయిలో పాల్గొంటారని మంత్రి రోజా వివరించారు. అన్ని స్థాయిల్లోనూ ప్రతిభ కనబరిచే క్రీడాకారులను ఎంపిక చేసి వారి లక్ష్య సాధనకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. 27 నవంబర్ 2023న ప్రారంభమైన ఆడుదాం ఆంధ్రా వెబ్ సైట్ లో కేవలం 72 గంటల్లోనే 5 లక్షల మంది రిజిస్టర్ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆడుదాం ఆంధ్రాలో దాదాపు కోటి మంది రిజిస్టర్ చేసుకుంటారని అంచనా వేస్తున్నామన్నారు. ఆడుదాం ఆంధ్రాలో రిజిస్టర్ చేసుకోవాలనుకునే వారు https://aadudamandhra.ap.gov.in/login లేదా 1902 కు కాల్ చేయడం ద్వారా లేదా సమీప గ్రామ సచివాలయాలను సంప్రదిస్తే సంబంధిత అధికారులు రిజిస్టర్ చేసేందుకు సహాయపడుతారన్నారు. 15 సంవత్సరాల వయస్సు పై బడిన వయస్సుగల వారు రిజిస్టర్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించడం అభినందనీయమని మంత్రి రోజా అన్నారు. ఆడుదాం ఆంధ్రా మీ ఆరోగ్యం కోసం, మీ భవిష్యత్ కోసం, మీలోని ప్రతిభకు పట్టం కట్టడం కోసం, మీలో క్రీడాస్ఫూర్తిని పెంచడం కోసం రూపొందించిందన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ఆడుదాం ఆంధ్రాలో కూడా ఆడ పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొని గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నామన్నారు. ఆడపిల్లలు అంటే ఆడ పులులు, బాగా ఆడే పిల్లలు అనేలా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నామన్నారు. క్రీడల పట్ల ఆసక్తి, అభిమానం ఉన్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికే ఇది చెల్లుతుందన్నారు. సంక్షేమం, ఉపాధి, పర్యాటకం, సాంస్కృతికం ఇలా అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తూ ముఖ్యమంత్రి విజయవంతంగా ముందుకెళ్తున్నారన్నారు.
దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రాకు సంబంధించిన 5 క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు సర్టిఫికెట్లు, ట్రోఫీలు, పతకాలతో పాటు రూ. 12 కోట్ల విలువగల నగదు బహుమతులను అందిస్తామన్నారు. ఆడ, మగ, క్రీడల మీద ఆసక్తి ఉన్న ఎవరైనా కూడా ఆడుదాం ఆంధ్రాలో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చన్నారు. ఆనందం, ఆరోగ్యంతో పాటు నచ్చిన ఆటల్లో రాణించేందుకు యువతకు ఇదొక సదవకాశమన్నారు. ప్రతిభ ఉన్నవాళ్లకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేందుకు ఆడుదాం ఆంధ్రా మంచి వేదికగా దోహదపడుతుందని మంత్రి రోజా పేర్కొన్నారు. 3 ఫిబ్రవరి, 2024న విశాఖపట్నంలో రాష్ట్ర స్థాయి సంబరాలతో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర యువత కోసం తీసుకొచ్చిన అతి పెద్ద క్రీడా సంబరమైన ఆడుదాం ఆంధ్రాని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మంత్రి రోజా కోరారు.
క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ వినూత్న కార్యక్రమాలతో, విప్లవాత్మక చర్యలతో ప్రజల ముంగిటకు వెళ్లడం, ప్రజల మన్ననలు పొందడం గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికే చెల్లుతుందన్నారు. రాష్ట్ర చరిత్రలో జరిగే అతి పెద్ద క్రీడా సంబురమే ఆడుదాం ఆంధ్రా అని ఆయన అభివర్ణించారు. ఆడుదాం ఆంధ్రా పోటీల నిర్వహణపై జిల్లా ముఖ్య శిక్షకులు, ఫిజికల్ డైరెక్టర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు, వాలంటీర్లకు శాప్ అధికారులతో చర్చా కార్యక్రమాలు నిర్వహించి శిక్షణనిస్తున్నామన్నారు. ఇప్పటికే శాప్ లీగ్స్, జగనన్న క్రీడా సంబురాలు, సీఎం కప్,జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు ఇన్సెంటివ్స్ అందించడం జరిగిందన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు అందించే ఆర్థిక సాయం గత బకాయిలతో సహా చెల్లించడం జరిగిందన్నారు. క్రీడా శాఖ ద్వారా ఇప్పటికే 2400కు పైగా ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. మంత్రి రోజా చొరవతో పలువురు ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా భవిష్యత్ లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లతో క్రికెట్ తర్ఫీదు అందిస్తామన్నారు.