Saina Nehwal- Kashyap: ఇటీవల కాలంలో సినీ, క్రీడా ప్రముఖులు విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. మూడు ముళ్ల బంధం మూన్నాళ్లు కూడా నిలవడం లేదు. సెలబ్రెటీలుగా అభిమానులకు ఆదర్శకంగా ఉండాల్సిన వారే చిన్న చిన్న కారణాలతో విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ జంట సైనా నెహ్వాల్-కశ్యప్ పారుపల్లి వచ్చింది. ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా సైనా పోస్ట్ చేసింది.
20 ఏళ్ల స్నేహానికి, ఏడేళ్ల వివాహబంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపింది. ఇద్దరం తీవ్రంగా ఆలోచించి, చర్చించి విడిపోవాలని నిర్ణయించుకున్నామని వెల్లడించింది. జీవితం కొన్నిసార్లు వేర్వేరు మార్గంలో తీసుకెళ్తుందని పేర్కొంది. ఇలాంటి కఠిన సమయంలో తమ గోప్యతను గౌరవించాలని సూచించింది. సైనా విడాకుల ప్రకటన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే విడాకులపై కశ్యప్ మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
🚨 India's Badminton Stars Saina Nehwal & Parupalli Kashyap have decided to separate! pic.twitter.com/887oVHIojx
— The Khel India (@TheKhelIndia) July 13, 2025
కాగా గోపిచంద్ బ్యాడ్మింటన్ ఆకాడమీలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడంతో ఇరు కుటుంబసభ్యులను ఒప్పించి 2018లో వివాహం చేసుకున్నారు. 2012 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సైనా.. 2015లో మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ సాధించింది. ఫస్ట్ ర్యాంక్ సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించింది. అయితే ఆ తర్వాత గాయాల బారిన పడింది. దీంతో ఫామ్ కోల్పోయి వరుస పరాజయాలు చవిచూసింది. 2023లో చివరిసారిగా బ్యాడ్మింటన్ మ్యాచ్ ఆడింది. ఆమె ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది. ఇక కశ్యప్ 2014 కామన్‌వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. 2024లో బ్యాడ్మింటన్‌కు రిటైర్మంట్ ప్రకటించాడు. ప్రస్తుతం కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.


