ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సిండే టెస్టులో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) అవుటైన తీరుపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సగం వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో ఉంది. దీంతో బాధ్యతగా ఆడి జట్టును గట్టెక్కించాల్సిన పంత్.. ఆసీస్ బౌలర్ బోలాండ్ వేసిన బంతిని ర్యాంప్ షాట్‌ను కొట్టేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు. ఆ సమయంలో కామెంట్రీ బాక్స్‌లో ఉన్న గావస్కర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అత్యంత చెత్త షాట్ అంటూ అభివర్ణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
‘‘స్టుపిడ్ షాట్.. స్టుపిడ్ షాట్. అతడు భారత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లొద్దు. ఇతర డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాలి. క్లిష్ట సమయాల్లో చెత్త షాట్లను ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? టెస్టుల్లో ఓర్పు చాలా కీలకం. ఇదేమీ టీ20 లేదా 50 ఓవర్ల క్రికెట్ కాదు. పంత్ ఇలాంటి షాట్లను ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ ఫీల్డర్లు థర్డ్‌మ్యాన్ దిశగా లేరు. ఆ తర్వాత అక్కడ ఫీల్డర్లను పెట్టారు. అలాంటప్పుడు పంత్ ఆచితూచి అలాంటి షాట్లను ఆడాలి. లెగ్‌సైడ్ కొడదామని భావించినా.. ఎడ్జ్ తీసుకొని ఆఫ్‌సైడ్ వెళ్లిపోయింది. ఇలాంటి షాట్ల ఎంపిక ఇప్పుడు అవసరం లేదు’’ అని గావస్కర్ అభిప్రాయపడ్డాడు.