సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ సౌతాఫ్రికా టీ20(SAT20)లీగ్ టీమ్ ఈస్టర్న్ కేప్(Eastern cape)ఓనర్ అన్న సంగతి తెలిసిందే. ఈ లీగ్‌లో ఈస్టర్న్ కేప్ వరుసగా రెండు సార్లు కప్ గెలిచి దుమ్మురేపింది. ఇప్పుడు మూడో సీజన్‌లోనూ తుది పోరులో తలపడేందుకు అడుగుదూరంలో నిలిచింది. తాజాగా సెంచూరియన్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం సాధించి క్వాలిఫయర్-2లోకి ఎంట్రీ ఇచ్చింది.
జొబర్గ్ సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్(Sunrisers) నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల )సాయంతో 62 పరుగులు చేశాడు. ఇక బెడింగ్‌హాం(27), టోనీ డి జోర్జి(14), జోర్డాన్ హెర్మాన్(12), అబెల్(10), ట్రిస్టన్ స్టబ్స్ (26), జాన్సెన్ (23) పరుగులతో రాణించారు. జొబర్గ్ సూపర్ కింగ్స్ బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్, విల్‌జోయెన్ తలో రెండు వికెట్లు తీయగా.. మహీశ్ తీక్షణ, మొయిన్ అలీ చెరో వికెట్ తీశారు.
ఇక లక్ష్య ఛేదనలో సూపర్ కింగ్స్ 152/7 పరుగులకే పరిమితమైంది. జానీ బెయిర్‌స్టో మాత్రమే 37 పరుగులతో రాణించాడు. జోన్స్(22 నాటౌట్) పర్వాలేదనిపించాడు. డెవాన్ కాన్వే(30), కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(19), విహాన్ ల్యూబే(13), జేపీ కింగ్(9), హార్డస్ విల్‌జోయెన్(14), మొయిన్ అలీ(0), విఫలమయ్యారు. ఈ మ్యాచులో విజయం సాధించిన సన్‌రైజర్స్.. క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ పోరులో విజయం సాధించిన జట్టు ఫైనల్‌లో ముంబయి ఇండియన్స్ కేప్‌టౌన్‌తో తలపడనుంది.