Sunday, February 23, 2025
HomeఆటIND vs PAK: టీమిండియా సూపర్ విక్టరీ.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాక్ ఔట్..!

IND vs PAK: టీమిండియా సూపర్ విక్టరీ.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాక్ ఔట్..!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా అదరగొట్టింది. దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్ చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో అడుగు పెట్టింది. వరుస మ్యాచుల్లో ఓడిన పాకిస్తాన్ సెమీస్ రేసు నుంచి దాదాపుగా తప్పుకుంది. 242 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ 42.3 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి ఛేదించేసింది.

- Advertisement -

విరాట్ కోహ్లీ (100) ముందుండి గెలిపించాడు. శ్రేయస్ అయ్యర్ (56) రాణించాడు. శుబ్‌మన్ గిల్ (46) మరోసారి నిలకడ ప్రదర్శించాడు. ఛేదనను భారత్ మెరుపు షాట్లతో ఆరంభించింది. ముఖ్యంగా రోహిత్ శర్మ (20) ఉన్నంతసేపు భారీ షాట్స్ ఆడాడు. అయితే షాహీన్ అఫ్రిది వేసిన అద్భుత యార్కర్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం కోహ్లీ, గిల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరు 2వ వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అనంతరం గిల్ అవుటయ్యాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి విరాట్ కోహ్లీ భారత్‌ను లక్ష్యం వైపునకు నడిపించాడు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీ అందుకున్నాడు. అనంతరం అవుటయ్యాడు. హార్దిక్ పాండ్యా (8) వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యాడు.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్‌ను భారీ స్కోర్ చేయకుండా టీమిండియా బౌలర్లు అడ్డుకున్నారు. పాకిస్తాన్‌ను 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్‌కు ఓపెనర్లు బాబర్ ఆజామ్, ఇమామ్ ఉల్ హక్‌లు తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించి శుభారంభం అందించారు. బాబర్ ఆజామ్ మంచి టచ్‌లో కనిపించాడు. 5 ఫోర్లు బాది క్రీజులో పాతుకుపోయినట్లు కనిపించాడు. బాబర్‌ను ఔట్ చేసి హార్దిక్ భారత్‌కు తొలి వికెట్‌ను అందించారు.

ఇక ఇమామ్ ఉల్ హక్ ఆరంభం నుంచి తడబడ్డాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో సింగిల్ కోసం ప్రయత్నించి అక్షర్ పటేల్ వేసిన సూపర్ త్రోతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో 47 పరుగుల వద్ద పాక్ రెండో వికెట్ కోల్పోయింది. అయితే సౌద్ షకీల్, రిజ్వాన్‌లు భుజాన వేసుకున్నారు. రిజ్వాన్-సౌద్ షకీల్ జోడి మూడో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని రిజ్వాన్‌ను ఔట్ చేయడం ద్వారా అక్షర్ పటేల్ విడగొట్టాడు.

అనంతరం భారత బౌలర్లు విజృంభించారు. రిజ్వాన్ ఔటైన కాసేపటికే సౌద్ షకీల్‌తో పాటు తయ్యబ్ తాహిర్ పెవిలియన్‌కు చేరుకున్నారు. ఆఖరిలో ఖుష్దిల్ షా, నదీమ్ షా రాణించడంతో పాక్ ఓ మోస్తరు స్కోరుకు పరిమితమైంది. పాక్ బ్యాటర్లలో సౌద్ షకీల్ (62) హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (46) రాణించాడు. ఖుష్దిల్ షా (38), బాబర్ ఆజామ్ (23)లు ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో రాణించాడు. హార్దిక్ పాండ్యాకు 2 వికెట్లు దక్కాయి. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలకు తలా ఒక వికెట్ లభించాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News