ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో (World Chess Championship)తెలుగు కుర్రాడు దొమ్మరాజు గుకేశ్(Gukesh) సంచలనం సృష్టించాడు. డిఫెండింగ్ ఛాంపియన్, చైనా ఆటగాడు డింగ్ లిరెన్‌తో జరిగిన తుది పోరులో విజేతగా నిలిచాడు. గురువారం జరిగిన 14వ రౌండ్‌లో ఆద్యంత ఉత్కంఠభరితంగా సాగిన గేమ్‌లో గుకేశ్ తన ఎత్తులతో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. దీంతో భారత మాజీ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌ను సొంతం చేసుకున్న రెండో భారత ఆటగాడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు.
అంతేకాకుండా ప్రపంచ చెస్ ఛాంపియన్ గెలిచిన అతిపిన్న వయస్కుడిగానూ గుకేశ్ రికార్డు సృష్టించాడు. 18 ఏళ్ల వయస్సులో 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించడం విశేషం. క్యాండిడేట్స్ 2024 టోర్నమెంట్, చెస్ ఒలింపియాడ్ స్వర్ణాన్ని కూడా గెలుచుకున్న గుకేష్.. చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ అయ్యాడు.
గుకేశ్ విజయంపై ప్రధాని మోదీ(PM Modi) అభినందనలు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘అద్భుతమైన విజయం సాధించిన గుకేశ్‌కు అభినందనలు. అతడి అసమాన ప్రతిభ, కృషి, సంకల్పాల ఫలితమే ఈ విజయం. చెస్ చరిత్రలో గుకేశ్ పేరును సుస్థిరం చేయడమే కాకుండా లక్షలాది మంది యువతకు గొప్ప కలలు కనేందుకు ఈ గెలుపు ప్రేరణగా నిలుస్తుంది’’ అని పేర్కొన్నారు.
18 ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడంతో తన పదేళ్ల కల సాకారమైందని గుకేశ్ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ క్షణం కోసం తాను దశాబ్దకాలంగా వేచిచూస్తానని తెలిపాడు. తన కంటే తన తల్లిదండ్రులకే గెలవాలనే కసి ఉందని.. ఈ విజయం వారికి అంకితం చేస్తున్నానని వెల్లడించాడు.