US Open Tournament: యూఎస్ ఓపెన్ టోర్నమెంట్‌లో నిరాశాజనకమైన ఓటమి తరువాత టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్ తన ప్రవర్తనకు భారీ జరిమానాను ఎదుర్కొన్నారు. తొలి రౌండ్‌లో ఓడిపోయిన ఈ రష్యన్ ఆటగాడు, కోర్టులో తన నిరాశను అదుపు చేసుకోలేక బ్యాట్‌ను విరగ్గొట్టాడు. అంతేకాకుండా, ప్రేక్షకులతో కూడా అనుచితంగా ప్రవర్తించాడని నిర్వాహకులు తెలిపారు.
ఈ ఘటనల కారణంగా అతనికి $42,500 (సుమారు ₹37 లక్షలు) జరిమానా విధించారు. ఈ మొత్తం అతను మ్యాచ్ ఆడినందుకు వచ్చే $1,10,000 ప్రైజ్‌మనీలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ.
మెద్వెదెవ్ ఫ్రాన్స్‌కు చెందిన బెంజమిన్ బోంజికి వ్యతిరేకంగా జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయాడు. మొదట రెండు సెట్‌లు కోల్పోయినప్పటికీ, అతను తర్వాత రెండు సెట్‌లు గెలిచి మ్యాచ్‌ను ఐదో సెట్‌కు తీసుకెళ్లాడు. చివరి సెట్‌లో, ఒక ఫోటోగ్రాఫర్ వల్ల ఆటకు ఆటంకం ఏర్పడటంతో, మెద్వెదెవ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో ప్రేక్షకులు అతనిని అపహాస్యం చేయగా, మెద్వెదెవ్ వారిని రెచ్చగొట్టేలా ప్రతిస్పందించాడు. నాలుగో సెట్ గెలిచిన తర్వాత అతను ప్రేక్షకులకు అసభ్యకరమైన సంజ్ఞలు కూడా చేశాడు. ఈ ప్రవర్తన కారణంగానే జరిమానా విధించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.


