ఐర్లాండ్ తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా మహిళా జట్టు భారీ విక్టరీ సొంతం చేసుకుంది. 304 పరుగుల తేడాతో గెలిచి.. క్రికెట్ చరిత్రలోనే పెద్ద విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. 50 ఓవర్లలో 435 రన్స్ చేసింది. ఇక 436 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఐర్లాండ్ మహిళలు.. కేవలం 130 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
బ్యాటర్లతో పాటు.. భారత బౌలర్లు కూడా విజృంభించడంతో.. ఐర్లాండ్ కు ఓటమి తప్పలేదు. ఐర్లాండ్ బ్యాటర్లలో ఫోర్బ్స్ 41, ఓర్లా 36 పరుగులతో పరవాలేదనిపించారు. కానీ మిగతా వాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. భారత ప్లేయర్లలో దీప్తి వర్మ 3 వికెట్లు తీయగా, తనుజా 2 వికెట్లు పడగొట్టారు. ఇక సింధు, మిన్ను మణి, సయాలి ఒక్కో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఆరంభం నుంచే ఐర్లాండ్ బౌలర్లలకు చుక్కలు చూపించారు. కెప్టెన్ స్మృతి మంధాన, ప్రతీకా రావల్ బౌండరీల వర్షం కురిపించారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 233 పరుగుల రికార్డుస్థాయి భాగస్వామ్యం నమోదు చేశారు. ఇద్దరూ సెంచరీలతో విజృంభించారు.. దీంతో ఐర్లాండ్ బౌలర్లకు వికెట్లు తీయడమే కష్టమయ్యింది.
ప్రతీకా రావల్ (154), స్మృతి మంధాన (135) భారీ సెంచరీలు బాదారు. అలాగే రిచా ఘోశ్ 59, తేజల్ 28, హర్లీన్ 15 రన్స్ చేశారు. దీంతో 50 ఓవర్లలో భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 435 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా 2 వికెట్లు తీయగా… ఫ్రేయా, కెల్లీ, డెంప్సీ చెరో వికెట్ పడగొట్టారు. ఇక ఈ విజయంతో టీమిండియా మూడు మ్యాచుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ రెండు కూడా ప్రతీకా రావల్ సొంతం చేసుకుంది.