కొంతకాలంగా టీమిండియా క్రికెటర్లలో విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. మొన్న శిఖర్ దావన్, నిన్న యుజ్వేంద్ర చాహల్ వంటి ఆటగాళ్లు భార్యల నుంచి విడిపోగా.. తాజాగా డాషింగ్ ఓపెనర్, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) కూడా విడాకులకు(Divorce) సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. తన భార్య ఆర్తి అహ్లావత్‌తో ఆయన విడిపోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో డైవర్స్ ప్రచారం జోరందుకుంది.
సెహ్వాగ్ 2004 డిసెంబరులో ఆర్తి అహ్లావత్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఆర్యవీర్, వేదాంత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దాదాపు 20 ఏళ్ల పాటు సాఫీగా సాగిన వీరి వివాహ బంధంలో కొన్ని నెలల కిందట మనస్పర్థలు తలెత్తినట్లు సమాచారం. దీంతో కొంతకాలంగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు చెబుతున్నారు.
గతేడాది దీపావళి రోజు తన కుమారులు, తల్లితో దిగిన ఫొటోలను సెహ్వాగ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో ఆయన భార్య లేరు. ఇక చివరిసారిగా 2023లో తమ పెళ్లి రోజు సందర్భంగా భార్యతో దిగిన ఫొటోను సెహ్వాగ్ పోస్ట్ చేశారు. తాజాగా తన ఇన్‌స్టా ఖాతాలో భార్యను అన్‌ఫాలో చేయడం విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలపై అటు సెహ్వాగ్, ఇటు ఆర్తి స్పందించలేదు.