Wednesday, December 4, 2024
HomeఆటWater sports in Hussain Sagar: హుస్సేన్ సాగర్ లో వాట‌ర్ స్పోర్ట్స్

Water sports in Hussain Sagar: హుస్సేన్ సాగర్ లో వాట‌ర్ స్పోర్ట్స్

జెట్ స్కీయింగ్..

రాష్ట్రంలో ప‌ర్యాట‌కాన్ని అభివృద్ధి చేసేందుకు జల పర్యాటకం, సాహ‌స క్రీడ‌ల‌కు సరికొత్త రూపు సంతరించుకునే దిశగా సీయం రేవంత్ రెడ్డి సార‌ధ్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. జ‌ల ప‌ర్యాట‌కం అభివృద్ధిలో భాగంగా హుస్సేన్ సాగ‌ర్ లో అమ‌రావ‌తి బోటింగ్ క్ల‌బ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాట‌ర్ స్పోర్ట్స్ ను మంత్రి జూప‌ల్లి కృష్ణారావు లాంఛ‌నంగా ప్రారంభించారు. అనంత‌రం టీజీటీడీసీ చైర్మ‌న్ ప‌టేల్ ర‌మేష్ రెడ్డితో క‌లిసి మంత్రి జూప‌ల్లి జెట్ స్కీపై హుస్సేన్ సాగ‌ర్ లో కాసేపు విహారించారు.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా మంత్రి జూప‌ల్లి మాట్లాడుతూ… రాష్ట్రంలోని అందమైన పర్యాటక ప్రాంతాలు, పురాతన, చారిత్రాత్మక ప్రాంతాలతో పాటు టెంపుల్‌ టూరిజం, జ‌ల‌, సాహస క్రీడల టూరిజానికి అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ఇటీవలి కాలంలో వాటర్ స్పోర్ట్స్ విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో జల పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటు జల విహార‌ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నీటి వనరులను పరిశీలించి పర్యాటక అభివృద్ధికి అనుకూలమైన ప్రాంతాలను గుర్తించే ప‌ని ఉన్నామ‌ని చెప్పారు.

గణనీయంగా జల పర్యాటకం

అంతర్జాతీయ ప్రాముఖ్యత వచ్చేలా కృష్ణా న‌ది ప‌రివాహక ప్రాంతంలోని సోమ‌శిల బ్యాక్ వాట‌ర్స్, నాగ‌ర్జున సాగ‌ర్, ఇత‌ర రిజర్వాయ‌ర్లు, హైద‌రాబాద్ లోని హుస్సేన్ సాగ‌ర్, తదితర ప్రాంతాలను తీర్చిదిద్దితే రాష్ట్రంలో జ‌ల పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుంద‌ని వివ‌రించారు. ప‌ర్యాట‌క అభివృద్ధి వ‌ల్ల స్థానికుల‌కు ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌డంతో పాటు రాష్ట్ర ఆదాయం పెరుగుతుంద‌ని తెలిపారు.

మంచి నీటి సరస్సుగా సాగర్

హుస్సేన్ సాగ‌ర్ ను మంచి నీటి స‌రస్సుగా మారుస్తామ‌ని గ‌త పాల‌కులు ప్ర‌గాల్భాలు ప‌లికార‌ని, కానీ అవి నీటి మూట‌లుగానే మారాయ‌ని అన్నారు. హుస్సేన్ సాగ‌ర్ ను నీటిని శుద్ధి చేసి పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. ప‌ర్యాట‌క రంగాన్ని కూడా గ‌త ప‌దేళ్ల‌లో పూర్తిగా నిర్ల‌క్ష్యం చేశార‌ని విమ‌ర్శించారు.

నిరుపయోగంగా ఉన్నవాటిని

సీఎం రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ప‌ర్యాట‌క రంగ అభివృద్ధికి ప్ర‌త్యేక కార్య‌చ‌ర‌ణ రూపొందించి, దాని అమ‌లు ప‌రిచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. చాలా చోట్ల ప్ర‌భుత్వ స్థ‌లాలు, ఆస్తులు నిరర్ధ‌కంగా ఉన్నాయ‌ని వాటిని ఉప‌యోగంలోకి తెచ్చేలా ప్రణాళిక‌లు సిద్ధం చేస్తున్నామ‌ని, ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యంతో ప‌ర్యాట‌క రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నామ‌ని వివ‌రించారు. ప్ర‌భుత్వానికి వ్యాపార‌త్మ‌క ధోర‌ణి లేద‌ని, నిరుప‌యోగంగా ఉన్న వాటిని ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు పీపీపీ మోడ‌ల్ లో మౌలిక వ‌స‌తుల క‌ల్పిస్తామ‌ని అన్నారు.

జెట్ స్కీ, కయాకింగ్

హుస్సేన్ సాగ‌ర్ లో పెద్ద‌లు, పిల్ల‌లు క‌లిసి వాట‌ర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేసే విధంగా జెట్ స్కి, క‌య‌క్, జెట్ అటాక్, వాట‌ర్ రోల‌ర్ (జాబింగ్) ను ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులోకి తెచ్చిన‌ట్లు నిర్వ‌హ‌కులు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ప‌టేల్ ర‌మేష్ రెడ్డి, మెనేజింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌కాష్ రెడ్డి, అమ‌రావ‌తి బోటింగ్ క్ల‌బ్ సీఈవో త‌రుణ్ కాకాని పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News