ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025(Champions Trophy) చివర దశకు చేరుకుంది. మార్చి 9న దుబాయ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ జట్లు కప్ కోసం తలపడనున్నాయి. అయితే ఇప్పటివరకు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని అత్యధికంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు కైవసం చేసుకున్నాయి. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిపేలా ఈ ట్రోఫీని 1998లో ఐసీపీ ప్రవేశపెట్టింది. అప్పుడు ఈ టోర్నీని ఇంటర్నేషన్ కప్ అని పిలిచేవారు. అనంతరం 2000లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీగా పేరు మార్చారు. ఇక 2002 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీగా నామకరణం చేశారు. అప్పటి నుంచి ఈ ట్రోఫీని విభిన్న జట్లు అందుకున్నాయి.
1998లో విల్స్ ఇంటర్నేషనల్ కప్ పేరుతో బంగ్లాదేశ్‌లో ఈ టోర్నమెంట్ జరిగింది. ఈ కప్‌ను సౌతాఫ్రికా జట్టు గెలుచుకుంది. 2000లో కెన్యాలో జరిగిన ఐసీసీ నాకౌట్ టోర్నీని న్యూజిలాండ్ జట్టు గెలుచుకోవడం విశేషం. ఇక 2002లో శ్రీలంకలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని వర్షం కారణంగా భారత్, శ్రీలంక జట్లు సంయుక్తంగా పంచుకున్నాయి. 2004లో ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చిన ఈ ట్రోఫీని వెస్టిండీస్ జట్టు దక్కించుకుంది. 2006లో భారత్ వేదికగా జరిగిన టోర్నీని ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. 2009లో సౌతాఫ్రికాలో జరిగిన ఈ కప్‌ను కూడా ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఇక 2013లో ఇంగ్లాండ్‌లో జరిగిన ఈ టోర్నీని టీమిండియా గెలుచుకుంది. 2017లో ఇంగ్లాండ్‌లోనే జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ ముద్దాడింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్-న్యూజిలాండ్ జట్లతో ఏ జట్టు గెలుచుకుంటుందో యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.