Wiaan Mulder: ప్రపంచ రికార్డు నెలకొల్పాలంటే ఎంతో శ్రమించాలి. అందుకోసం తీవ్రంగా కష్టపడాలి. తమ పేరు తరతరాలు నిలిచిపోతుందని ఆశపడతారు. అయితే అలాంటి రికార్డును సృష్టించే అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా వదులుకుంటారా..? కానీ సౌతాఫ్రికా టెస్టు కెప్టెన్ వియాన్ ముల్డర్ మాత్రం ఓ అరుదైన రికార్డును వద్దనుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. జింబాబ్వే జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో తొలుత సౌతాఫ్రికా బ్యాటింగ్ చేసింది. సీనియర్ల విశ్రాంతితో తొలిసారి కెప్టెన్సీ వహిస్తున్న ముల్డర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలో సెంచరీ, డబుల్ సెంచరీ, త్రిపుల్ సెంచరీ కూడా చేశాడు.
అంతా బాగానే ఉంది. ముల్డర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌండరీల మోత మోగిస్తున్నాడు. ఈ క్రమంలో 350 పరుగుల మైలురాయిని కూడా చేరుకున్నాడు. అలా 334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్లతో 367 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అప్పటికీ కేవలం ఐదు వికెట్లు మాత్రమే పడ్డాయి. మరో 34 పరుగులు చేస్తే రెండు దశాబ్దాలుగా పైగా చెక్కుచెదరకుండా ఉన్న వరల్డ్ రికార్డు బద్దలయ్యేది. ముల్డర్ పేరు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. అయితే ఏమైందో ఏమో కానీ అనూహ్యంగా 626/5 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
2004లో ఇంగ్లాండ్ జట్టుపై విండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా టెస్టుల్లో ఏకంగా 400 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. 21 సంవత్సరాల నుంచి లారా రికార్డు బ్రేక్ కాలేదు. కొంతమంది ఆటగాళ్లు 400 పరుగుల చేరువ దాకా వచ్చి ఔటయ్యారు. అయితే ముల్డర్ మాత్రం మరో 34 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నా సరే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి చక్కని అవకాశం మిస్ చేసుకున్నాడు.
Also Read: మేజర్ లీగ్ క్రికెట్ ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు
టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ఆటగాళ్లను పరిశీలిస్తే.. బ్రియాన్ లారా (వెస్టిండీస్) – 400 పరుగులు, ఇంగ్లాండ్‌పై, 2004, లారా (వెస్టిండీస్) – 375 పరుగులు ఇంగ్లాండ్‌పై, 1994, మాథ్యూ హేడెన్ (ఆస్ట్రేలియా) – 380 పరుగులు, జింబాబ్వేపై, 2003, మహేల జయవర్దెనె (శ్రీలంక) – 374 పరుగులు సౌతాఫ్రికాపై, 2006, ముల్డర్ (సౌతాఫ్రికా) – 367 పరుగులు జింబాబ్వేపై, 2025 ఉన్నారు. ఇక భారత్ జట్టు తరపున టెస్టుల్లో 319 పరుగులతో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తొలి స్థానంలో నిలిచాడు.


