Women’s World Cup: మహిళల వన్డే ప్రపంచకప్ ఆరంభానికి ముందు నుంచి అన్ని జట్లకు ఆస్ట్రేలియా గండం ఉంది. ఇప్పుడు భారత్ కు కూడా అదే అతిపెద్ద సవాల్. ప్రపంచకప్ కలను సొంతగడ్డపై నెరవేర్చుకోవాలని చూస్తున్న భారత అమ్మాయిలకు ఏదో ఒక దశలో ఆస్ట్రేలియా రూపంలో పెద్ద అడ్డంకి ఎదురవుతుందన్నది ముందు నుంచి ఉన్న అంచనానే. ఇప్పుడు సెమీస్‌లో ఆ కఠిన పోరుకు రంగం సిద్ధమైంది. మరి హర్మన్‌ప్రీత్ సేన అత్యుత్తమ ప్రదర్శన చేస్తుందా? కంగారూలను జయించి ప్రపంచకప్ ఫైనల్ చేరుతుందా? ఇవాళ ఆస్ట్రేలియాతో సెమీస్ మధ్యాహ్నం 3 నుంచి జరగనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.
Read Also: Women’s World Cup: వోల్వార్ట్ వావ్ షో.. వరల్డ్ కప్ ఫైనల్స్ లోకి సౌతాఫ్రికా
గ్రూప్ దశలో ఓ మోస్తరు ప్రదర్శనే
మహిళల వన్డే ప్రపంచకప్ గ్రూప్ దశలో ఓ మోస్తరు ప్రదర్శనతోనే సెమీస్ బెర్తు సాధించింది భారత జట్టు. అయితే, ఓకానొక దశలో సెమీస్ కు వెళ్తుందా అనే అనుమానాలు వచ్చాయి. కానీ, నాకౌట్‌లో మాత్రం అత్యుత్తమంగా ఆడాల్సిందే. ఎందుకంటే సెమీస్‌లో ఎదురవుతోంది ఆస్ట్రేలియా. టోర్నీలో ఇప్పటిదాకా ఓటమే ఎరుగని జట్టు అదొక్కటే. సెమీస్‌లోనూ ఫేవరెట్ కంగారూలే అనడంలో సందేహం లేదు. గ్రూప్ దశలో ముఖాముఖి పోరులోనూ ఆ జట్టే పైచేయి సాధించింది. కాకపోతే ఆ మ్యాచ్‌లో భారత్ బాగానే ఆడింది. 330 స్కోరు చేసింది. విజయం కోసం కడదాకా పోరాడింది. ప్రపంచకప్ కంటే ముందు జరిగిన వన్డే సిరీస్‌లోనూ భారత్ మెరుగ్గా ఆడింది. ఒక మ్యాచ్ నెగ్గి, మరో మ్యాచ్‌లో విజయానికి చేరువగా వెళ్లింది. గురువారం కూడా ఇలాగే ఆత్మవిశ్వాసంతో ఆడి కంగారూలపై పైచేయి సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Read Also: Bigg Boss elimination: అబ్బ సాయిరాం.. ఈ వీక్ ఔటయ్యేది ఈమేనా?
ఆ గెలుపే స్ఫూర్తిగా..
ఆస్ట్రేలియా గొప్ప జట్టు. అంతేకాకుండా, ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉంది. అలా అని కంగారూలను ఓడించడం అసాధ్యం కాదు. ప్రపంచ కప్ నాకౌట్ దశలో ఆసీస్‌పై అద్భుత విజయం సాధించిన రికార్డు భారత్ సొంతం. 2017 సెమీస్‌లో కంగారూలకు మామూలు షాక్ ఇవ్వలేదు భారత్. అప్పుడు మహిళల వన్డే చరిత్రలోనే అత్యుత్తమం అనదగ్గ ఇన్నింగ్స్ (171 నాటౌట్)తో జట్టును గెలిపించిన హర్మన్‌ప్రీత్ ఇప్పుడు కెప్టెన్. టోర్నీలో ఇప్పటిదాకా పెద్దగా రాణించనప్పటికీ.. సెమీస్‌లో కెప్టెన్ చెలరేగుతుందని జట్టు ఆశిస్తోంది. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ ఫామ్‌లో ఉన్నారు. ప్రతీక రావల్ గాయంతో టోర్నీకి దూరం కావడం ప్రతికూలతే అయినా.. డాషింగ్ ఓపెనర్ షెఫాలి రూపంలో సరైన ప్రత్యామ్నాయమే దొరికింది.
250-260 పరుగులకు కట్టడి
గ్రూప్ దశలో ఆడినట్లే ప్రధాన బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే భారీ స్కోరు చేయడం కష్టమేమీ కాదు. ఆసీస్‌ను 250-260 మధ్య కట్టడి చేయగలిగితే ఛేదన కూడా సాధ్యమే. బంగ్లాతో రద్దయిన చివరి లీగ్ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన రాధ యాదవ్‌కు సెమీస్‌లోనూ అవకాశం దక్కొచ్చు. ఆమెతో పాటు దీప్తి, శ్రీ చరణి.. స్పిన్‌కు సహకరించే డీవై పాటిల్ స్టేడియం పిచ్‌ను సద్వినియోగం చేసుకుంటే ఆసీస్‌ను కట్టడి చేయొచ్చు. పాక్‌తో మ్యాచ్‌లో స్పిన్నర్ల దెబ్బకు కంగారూలు దెబ్బతిన్నారు. రేణుక సింగ్, అమన్‌జ్యోత్, క్రాంతి గౌడ్‌లతో పేస్ విభాగమూ మెరుగ్గానే ఉంది. పేసర్లు ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెడితే.. మిగతాది స్పిన్నర్లు చూసుకుంటారు. కానీ బ్యాటర్లయినా, బౌలర్లయినా చివరిదాకా పట్టు కొనసాగించడం కీలకం. ఆసీస్‌తో లీగ్ మ్యాచ్‌లో గెలిచేందుకు మంచి అవకాశాలు వచ్చినా ఒత్తిడికి గురై ఓటమి పాలైన భారత్.. సెమీస్‌లో ఆ తప్పులు జరగకుండా చూసుకోవాలి.


