Friday, November 22, 2024
Homeటెక్ ప్లస్Digital arrest: డిజిట‌ల్ అరెస్టుతో జ‌ర‌భ‌ద్రం

Digital arrest: డిజిట‌ల్ అరెస్టుతో జ‌ర‌భ‌ద్రం

సైబ‌ర్ నేరాల్లో ఇదో కొత్త పంథా

ఇప్పుడు ఉన్న‌దంతా డిజిట‌ల్ యుగ‌మే. ఫోన్‌లో ఉండే బ్యాంకింగ్ యాప్‌ల‌తో నిమిషాల వ్య‌వ‌ధిలో ఎవ‌రికి కావాలంటే వారికి ల‌క్ష‌ల్లో పంపుకోవ‌చ్చు, ఎవ‌రి నుంచైనా అందుకోవ‌చ్చు.

- Advertisement -

ఇదంతా నాణేనికి ఒక‌వైపే

మ‌రోవైపు చూస్తే.. మ‌న స‌మ‌స్త స‌మాచారం ఎప్పుడో బ‌ట్ట‌బ‌య‌లైపోయింది. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు ఇచ్చేయ‌డం, ప్ర‌తి మాల్‌లోను, మందుల దుకాణాల్లోనూ ఫోన్ నంబ‌రు చెప్పేయ‌డం వ‌ల్ల ఈ స‌మాచారం అంతా న‌డిబ‌జారులో ఉంటోంది. సైబ‌ర్ నేరాల‌కు పాల్ప‌డేవారికి ఈ డేటా పెద్ద వ‌రంగా ఉంటోంది.

ఈ త‌ర‌హా మోసాల్లో స‌రికొత్త‌గా జ‌రుగుతున్న‌ది.. డిజిట‌ల్ అరెస్టు! దాదాపు ఒక రోజంతా మ‌న‌ల్ని బెదిరించి, భ‌య‌పెట్టి, ఇంకేం ప‌ని చేయ‌నివ్వ‌కుండా, ఎవ‌రికీ ఫోన్ చేయ‌డానికి కూడా వీల్లేకుండా చేసి, మ‌న ఖాతాలోంచి మ‌న చేతే కొన్ని ల‌క్ష‌ల రూపాయ‌లు వాళ్ల ఖాతాలోకి బ‌దిలీ చేయించుకునే ప్ర‌క్రియ‌నే డిజిట‌ల్ అరెస్టు అంటున్నారు.

ఇదెలా జ‌రుగుతుందంటే… సైబ‌ర్ నేర‌గాళ్లు వీడియో కాల్స్ ద్వారా ఒక ర‌క‌మైన భ‌యాన్ని క‌లిగిస్తారు. త‌ప్పుడు సాక్ష్యాలు సృష్టించి, బాధితుల‌ను తీవ్రంగా బెదిరిస్తారు. తాము చెప్పిన ప‌ని చేయ‌క‌పోతే వెంట‌నే అరెస్టు అవుతార‌ని, పోలీసులు ఏ క్ష‌ణంలోనైనా తలుపు త‌డ‌తార‌ని చెబుతారు. కాల్ క‌ట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తే మ‌రుక్ష‌ణంలో ఊచ‌లు లెక్క‌పెట్టాల్సి వ‌స్తుందంటారు. అది కూడా ఏదో చిన్నా చిత‌కా నేరాలు కాకుండా.. జాతీయ‌స్థాయిలో పెద్ద నేరం చేసేసిన‌ట్లుగా న‌మ్మిస్తారు. అప్ప‌టివ‌ర‌కు ఒక్క‌సారి కూడా పోలీసు స్టేష‌న్ గుమ్మం తొక్క‌నివాళ్లు ఈ మాట‌లు విని భ‌య‌ప‌డిపోతారు. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఎంతోకొంత స‌మ‌ర్పించుకుంటారు.

ఇటీవ‌ల ఫ‌రీదాబాద్‌కు చెందిన 23 ఏళ్ల యువ‌తి ఇలాంటి స్కాం బారిన‌ప‌డి, త‌మ‌ను తాము క‌స్ట‌మ్స్ అధికారులుగా చెప్పుకొన్న సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు రూ.2.5 ల‌క్ష‌లు స‌మ‌ర్పించుకున్నారు. ఈ కేసులో ఆమె పాస్‌పోర్ట్ మోసానికి పాల్ప‌డ్డార‌ని అవ‌త‌లివాళ్లు చెప్పారు. డిజిట‌ల్ అరెస్టును త‌ప్పించుకోవాలంటే రూ. 15 ల‌క్ష‌లు చెల్లించాల‌న్నారు. చివ‌ర‌కు ఆమె రూ.2.5 ల‌క్ష‌లకు బేరం కుదుర్చుకుని, ఆ మొత్తం పంపారు. ఇదంతా పూర్త‌య్యేవ‌ర‌కు స్కైప్ కాల్ క‌ట్ చేయ‌కూడ‌ద‌ని సైబ‌ర్ నేర‌గాళ్లు ఆమెను హెచ్చ‌రించారు.

మ‌రో కేసులో బెంగ‌ళూరుకు చెందిన ఓ మ‌హిళ‌కు ఆమె పూర్తి ఆధార్ నంబ‌రు చెప్పి, ఆ నంబ‌రుతో ముంబై మ‌హాన‌గ‌రంలో కొన్ని సిమ్ కార్డులు తీసుకున్నార‌ని, వాటిని మ‌హిళ‌ల అక్ర‌మ ర‌వాణా, ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల్లో ఉప‌యోగించార‌ని చెప్పారు. ఎన్ఐఏ పోలీసులు మీ వీధి మొద‌ట్లోనే ఉన్నార‌ని, వాళ్లు ఏ క్ష‌ణ‌మైనా వ‌స్తార‌ని చెప్పి.. స్థానిక పోలీసు స్టేష‌న్‌కు కేసు బ‌దిలీ చేయ‌డానికి స్కైప్ కాల్‌లోకి రావాల‌ని చెప్పారు. తీరా స్కైప్ కాల్‌లోకి వ‌చ్చాక‌.. కేసు తీవ్ర‌త‌రం కాకుండా ఉండాలంటే అత్యవ‌స‌రంగా రూ. 10 ల‌క్ష‌ల‌ను రిజ‌ర్వు బ్యాంకు ఖాతాలోకి పంపాల‌ని, విచార‌ణ మొత్తం పూర్త‌య్యాక నిర‌ప‌రాధిగా తేలితే ఆ మొత్తం తిరిగి ఇస్తామ‌ని చెప్పారు. రిజ‌ర్వు బ్యాంకే క‌దా అని న‌మ్మిన ఆమె.. ఆ మొత్తం పంపేశారు. ఎన్నాళ్ల‌యినా ఎవ‌రూ మాట్లాడ‌క‌పోవ‌డంతో పోలీసులను సంప్ర‌దిస్తే, చివ‌రకు ఆమె మోస‌పోయిన‌ట్లు తెలిసింది.

వీటి బారిన ప‌డ‌కుండా ఉండాలంటే ఏం చేయాలి..?

అప్ర‌మ‌త్తంగా ఉండండి: సాధార‌ణంగా జ‌రుగుతున్న స్కాంల గురించి తెలుసుకుని, స్కామ‌ర్లు ఉప‌యోగించే ప‌దాల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి.

ఎవ‌రు ఫోన్ చేస్తున్నారో చూసుకోండి: ఎవ‌రైనా తాము ఫ‌లానా విభాగం అధికారుల‌మంటూ ఫోన్ చేస్తే, వారి అధికారిక హోదా, ఆఫీసు ఫోన్ నంబ‌రు, ఎంప్లాయిమెంట్ ఐడీ లాంటివి త‌నిఖీ చేసుకునేవ‌ర‌కు ఏమీ చెప్పొద్దు.

భ‌య‌ప‌డ‌కండి: అవ‌త‌లివాళ్లు పోలీసులం అని చెప్ప‌గానే మీరు కంగారు ప‌డ‌క్క‌ర్లేదు. న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఏవైనా ఉన్నా, వాటిని త‌గిన విధానంలోనే చేస్తారు త‌ప్ప త‌క్ష‌ణం బెదిరించ‌రు.

మీ వివ‌రాలు చెప్పొద్దు: ఎవ‌రు ఫోన్ చేసినా, వారి విష‌యాలు తెలుసుకున్నా కూడా వారికి మీ బ్యాంకు ఖాతా వివ‌రాలు, మీ వ్య‌క్తిగ‌త వివ‌రాలు, ఆధార్‌, పాన్ లాంటివి అస‌లు చెప్ప‌కూడ‌దు.

వివ‌రాలు తెలుసుకోండి: చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మిమ్మ‌ల్ని బెదిరిస్తే వెంట‌నే వాటి గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయండి. అధికారిక మార్గాల్లో పోలీసుల‌ను గానీ, న్యాయ‌వాదుల‌ను గానీ సంప్ర‌దించి, ఇలాంటివి ఉంటాయా అన్న వివ‌రాలు తెలుసుకోండి.

అప్‌డేట్ చేసుకోండి: సైబ‌ర్ నేర‌స్థులు త‌ర‌చు చేసే స్కాంలు ఏంటో తెలుసుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ అవుతూ ఉండండి. వాళ్లు డ‌బ్బులు డిమాండ్ చేయ‌డం, వెంట‌నే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని బెదిరించ‌డం, అసాధార‌ణ ప‌ద్ధ‌తుల్లో చెల్లింపులు చేయాల‌న‌డం లాంటి వాటిని గుర్తించండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News