SIM card fraud : అరచేతిలో వైకుంఠం చూపించి, ఆపై నిలువునా దోచేస్తున్న సైబర్ కేటుగాళ్ల ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఆన్‌లైన్ మోసాలనే ఊబిలో చిక్కుకుని అమాయకులు విలవిలలాడుతున్న వేళ, మోసగాళ్ల పాలిట సింహస్వప్నంలా మారింది ప్రభుత్వ నిర్ణయం. దేశవ్యాప్తంగా ఏకంగా 3 నుండి 4 లక్షల సిమ్ కార్డులను బ్లాక్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు ఇంత పెద్ద మొత్తంలో సిమ్ కార్డులను ఎందుకు బ్లాక్ చేయాల్సి వచ్చింది. ఈ మోసగాళ్ల ఆటకట్టించేందుకు ప్రభుత్వం ప్రయోగిస్తున్న సరికొత్త అస్త్రం ఏమిటి..? దీని వెనుక ఉన్న పూర్తి వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో సైబర్ నేరాల విజృంభణ హద్దులు దాటుతోంది. ఫేక్ లింకులు, డిజిటల్ అరెస్టులు, బ్లాక్‌మెయిల్స్ వంటి రకరకాల మార్గాలలో మోసగాళ్లు ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా, సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో, ఆన్‌లైన్ మోసాలకు మూలమైన సిమ్ కార్డులపై కేంద్రం దృష్టి సారించింది. మోసాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన సుమారు 4 లక్షల సిమ్ కార్డులను రద్దు చేయడమే కాకుండా, కొత్త సిమ్ కార్డుల జారీ ప్రక్రియను మరింత కఠినతరం చేసింది.
Oనిత్యం 2000 నంబర్ల గుర్తింపు: మోసగాళ్లను పట్టుకోవడానికి ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది. మే 2025లో విడుదలైన ‘ఫైనాన్షియల్ రిస్క్ ఇండికేటర్’ డేటా ప్రకారం, ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న సుమారు 2,000 సిమ్ కార్డులను ప్రతిరోజూ గుర్తిస్తున్నారు. ఈ మోసపూరిత సిమ్ కార్డులను, వాటి ద్వారా జరుగుతున్న లావాదేవీలను గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సాంకేతికతను వినియోగిస్తున్నారు. యూపీఐ రాకతో లావాదేవీలు సులభమైనప్పటికీ, ఇదే అదనుగా మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ మోసాల కట్టడికే ప్రభుత్వం ఈ కొత్త వ్యవస్థను తెరపైకి తెచ్చింది.
‘ఆర్థిక ప్రమాద సూచికలు’ (Financial Risk Indicators): సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్రం ప్రయోగిస్తున్న ప్రధాన అస్త్రం ఈ ‘ఫైనాన్షియల్ రిస్క్ ఇండికేటర్స్’. దేశంలోని అన్ని బ్యాంకులు తమ వ్యవస్థలలో ఈ సూచికలను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఎలా పనిచేస్తుంది: ఈ వ్యవస్థ మోసాలకు పాల్పడే మొబైల్ నంబర్లను నిరంతరం విశ్లేషిస్తుంది. ఆ నంబర్ల కార్యకలాపాల ఆధారంగా వాటిని తక్కువ, మధ్యస్థ, అధిక ప్రమాదకరమైనవిగా వర్గీకరిస్తుంది. ఒక నంబర్ ‘అధిక ప్రమాదం’ కేటగిరీలోకి రాగానే, ఆ నంబర్‌తో ముడిపడి ఉన్న ఆర్థిక లావాదేవీలను బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తక్షణమే నిరోధించగలవు. ఈ సమాచారాన్ని టెలికాం కంపెనీలకు కూడా పంపి, ఆ సిమ్ కార్డులను బ్లాక్ చేయడానికి వేగంగా చర్యలు తీసుకుంటారు.
ఫైనాన్షియల్ రిస్క్ ఇండికేటర్స్ వంటి సాంకేతికతను ఉపయోగించడం ద్వారా, మోసపూరిత లావాదేవీలను ముందే పసిగట్టి నిరోధించడానికి వీలవుతుంది. టెలికాం కంపెనీలు కూడా తమ నెట్‌వర్క్‌లలో భద్రతను పెంచుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కఠిన చర్యలు, సాంకేతిక ఆవిష్కరణలు సైబర్ నేరాల కట్టడికి ఎంతగానో దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


