Google Maps save parking location : అదిరిపోయే ఆఫర్లతో కిటకిటలాడుతున్న షాపింగ్ మాల్… సెల్లార్‌లో ఎక్కడో కారు పార్క్ చేసి షాపింగ్‌లో మునిగిపోయారు. తిరిగొచ్చేసరికి, వేలాది వాహనాల మధ్య మీ కారెక్కడుందో తెలియక తలపట్టుకున్నారా..? సూపర్‌మార్కెట్ బయట బండి పెట్టి, తిరిగొచ్చాక అదేంటో గుర్తుపట్టలేక తికమకపడ్డారా? నగర జీవితంలో ఇలాంటి పార్కింగ్ కష్టాలు ప్రతి ఒక్కరికీ అనుభవమే. అయితే, మీ జేబులో ఉండే స్మార్ట్‌ఫోనే ఈ తలనొప్పికి శాశ్వత పరిష్కారం చూపగలదంటే నమ్ముతారా? అవును, దారి చూపడమే కాదు, మీరు బండి ఆపిన చోటును సైతం గుర్తుపెట్టుకునే అద్భుత ఫీచర్ గూగుల్ మ్యాప్స్‌లో దాగి ఉంది. మరి ఆ మ్యాజిక్ ఏంటి..? దాన్ని ఎలా ఉపయోగించాలి..?
రద్దీ ప్రదేశాలు, భారీ షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లలో వాహనాన్ని పార్క్ చేసి, తర్వాత దాన్ని వెతుక్కోవడం చాలా మందికి ఓ పెద్ద సవాలు. ఒకే రంగు, ఒకే మోడల్‌లో ఉండే ద్విచక్రవాహనాలైతే గందరగోళం మరింత ఎక్కువ. ఒక్కోసారి మన వాహనం అనుకుని వేరే వారి వాహనం తాళం తీయడానికి ప్రయత్నించిన సందర్భాలూ కోకొల్లలు. ఈ చిరాకు తెప్పించే సమస్యకు సాంకేతిక పరిష్కారంగా గూగుల్ మ్యాప్స్ ‘సేవ్ యువర్ పార్కింగ్ లొకేషన్’ (Save Your Parking Location) అనే ఫీచర్‌ను అందిస్తోంది. కేవలం కొన్ని క్లిక్స్‌తో మీ వాహనం ఎక్కడుందో కచ్చితంగా తెలుసుకోవచ్చు.
పార్కింగ్ లొకేషన్‌ను సేవ్ చేయడం ఎలా : ఈ ఫీచర్‌ను ఉపయోగించడం చాలా సులభం. కింది పద్ధతిని పాటిస్తే సరి.ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ యాప్‌ను తెరవండి. మీ ఫోన్ లొకేషన్ (GPS) ఆన్‌లో ఉందని నిర్ధారించుకోండి. మ్యాప్‌లో మీరు ప్రస్తుతం ఉన్న ప్రదేశాన్ని సూచిస్తూ ఒక నీలి రంగు చుక్క (Blue Dot) కనిపిస్తుంది. ఆ నీలి రంగు చుక్కపై ఒకసారి నొక్కండి (Tap). ఒక మెనూ ఓపెన్ అవుతుంది. అందులో ‘సేవ్ పార్కింగ్’ (Save Parking) అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. అంతే! మీ వాహనం పార్క్ చేసిన లొకేషన్ గూగుల్ మ్యాప్స్‌లో సేవ్ అయిపోతుంది.
సేవ్ చేసిన లొకేషన్‌ను తిరిగి కనుగొనడం ఎలా : మీ పనులన్నీ ముగించుకుని తిరిగి వాహనం దగ్గరకు వెళ్లాలనుకున్నప్పుడు.. మళ్లీ గూగుల్ మ్యాప్స్ యాప్‌ను తెరవండి.
కింద భాగంలో సెర్చ్ బార్‌లో ‘సేవ్డ్ పార్కింగ్’ (Saved parking) అని టైప్ చేయవచ్చు లేదా మ్యాప్‌పై కనిపించే ‘P’ గుర్తుపై క్లిక్ చేయవచ్చు. వెంటనే మీరు మీ వాహనాన్ని ఎక్కడ పార్క్ చేశారో మ్యాప్‌లో చూపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ‘డైరెక్షన్స్’ (Directions) బటన్ నొక్కితే, మీరున్న చోటు నుంచి మీ వాహనం వరకు నడిచి వెళ్లాల్సిన దారిని కూడా గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. ఈ ఫీచర్ కేవలం పార్కింగ్ కోసమే కాదు, మీరు సులభంగా మరిచిపోయే అవకాశం ఉన్న ఏ ప్రదేశాన్నైనా గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది.


