UPI security after phone theft : చేతిలో చరవాణి లేనిదే పూట గడవని రోజులివి. కానీ, ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఆ ఫోన్ పోతే కలిగే బాధ కంటే, దాని ద్వారా బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుండటం ఇప్పుడు పెను ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ఫోన్ దొంగిలిస్తే కేవలం పరికరాన్ని మాత్రమే అమ్మకునేవారు. కానీ ఇప్పుడు, ఆ ఫోన్‌లోని డిజిటల్ చెల్లింపు యాప్‌లే లక్ష్యంగా చేసుకొని నిమిషాల వ్యవధిలో లక్షలకు లక్షలు లూటీ చేస్తున్నారు. ఈ తరహా నేరాలు పెరిగిపోతున్నాయని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ కేటుగాళ్లు ఫోన్ దొంగిలించిన వెంటనే ఖాతాలను ఎలా ఖాళీ చేస్తున్నారు? మనం ఎలాంటి తక్షణ జాగ్రత్తలు తీసుకోవాలి?
గంటల వ్యవధిలో లక్షల లూటీ.. కొన్ని ఘటనలు: నిజామాబాద్ రైతుకు రూ.6.15 లక్షలు టోకరా: నిజామాబాద్‌కు చెందిన 62 ఏళ్ల రైతు, హైదరాబాద్ బోయిన్‌పల్లి బస్టాప్‌లో బస్సు ఎక్కాక తన ఫోన్ పోయినట్లు గ్రహించారు. అత్యవసర పని ఉండటంతో వెంటనే ఫిర్యాదు చేయలేదు. రెండు రోజుల తర్వాత కొత్త సిమ్ తీసుకుని, కొత్త ఫోన్‌లో వేయగానే రెండు బ్యాంకు ఖాతాల నుంచి రూ.6,15,000 డెబిట్ అయినట్లు వచ్చిన సందేశాలు చూసి నిర్ఘాంతపోయారు.
పాత ఫోనని వదిలేస్తే..: హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పాత ఫోన్ పోయిందని తేలిగ్గా తీసుకున్నారు. మరుసటి రోజు కొత్త సిమ్‌తో వేరే ఫోన్ వాడటం మొదలుపెట్టాక, తన ఖాతా నుంచి రూ.9,000 ఓ పెట్రోల్ బంక్‌కు బదిలీ అయినట్లు గుర్తించారు.
గంటలోపే అంతా మాయ: నడికుడికి చెందిన ధనుంజయరెడ్డి అనే వ్యక్తి ఫోన్ పోయిన గంటలోపే పోలీసులకు ఫిర్యాదు చేసి సిమ్ బ్లాక్ చేయించారు. కానీ, ఆ కొద్ది సమయంలోనే సైబర్ నేరగాళ్లు పలు పెట్రోల్ బంకులు, సెల్‌షాప్‌ల నిర్వాహకులకు ఫోన్‌పే చేసి రూ.2 లక్షలకు పైగా కొల్లగొట్టారు.
కేటుగాళ్ల పనితీరు ఇది : రద్దీగా ఉండే బస్సులు, రైల్వేస్టేషన్లే వీరి అడ్డా. ఫోన్ దొంగిలించగానే వారి పని మొదలవుతుంది.
అన్‌లాక్: సాధారణ సెల్‌ఫోన్లను అన్‌లాక్ చేయడం చాలా సులువు. స్థానికంగా ఉండే అనేక సెల్‌ఫోన్ దుకాణాల్లో నిమిషాల్లో ఈ పని చేసేస్తున్నారు.
పిన్ రీసెట్: ఫోన్‌లోని సిమ్ కార్డు సాయంతో ‘ఫర్గాట్ పిన్’ ఆప్షన్ ద్వారా యూపీఐ యాప్‌ల పిన్‌ను సులభంగా రీసెట్ చేస్తున్నారు. ఓటీపీ అదే ఫోన్‌కు వస్తుండటం వీరికి కలిసొస్తోంది.
డబ్బు బదిలీ: కొత్త పిన్ సెట్ చేసుకున్న వెంటనే, ఆ ఖాతాలోని డబ్బును ఖరీదైన వస్తువులు కొనడానికో, లేదా పెట్రోల్ బంకులు, ఇతరుల ఖాతాలకు బదిలీ చేసి అక్కడి నుంచి నగదు తీసుకోవడానికో ఉపయోగిస్తున్నారు. ఇదంతా బాధితుడు తేరుకునేలోపే జరిగిపోతోంది.
“రద్దీ ప్రదేశాల్లో ఫోన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా, యూపీఐ పిన్ నంబర్లను ఫోన్‌లో, కాంటాక్ట్ లిస్టులో సేవ్ చేసుకోవడం అత్యంత ప్రమాదకరం. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.”
– తిరుపతి రాజు, బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్
మీ ఫోన్ పోతే తక్షణమే చేయాల్సినవి ఇవి :
నిపుణుల సూచనల ప్రకారం, ఫోన్ పోయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ చర్యలు తీసుకోవాలి.
సిమ్ బ్లాక్ చేయండి: మొట్టమొదట చేయాల్సిన పని ఇదే. వేరే ఫోన్ నుంచి మీ నెట్‌వర్క్ ప్రొవైడర్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి, పోయిన సిమ్‌ను వెంటనే బ్లాక్ చేయించండి. దీనివల్ల ఓటీపీలు దుండగులకు చేరకుండా అడ్డుకోవచ్చు.
బ్యాంకును అప్రమత్తం చేయండి: మీ బ్యాంకు కస్టమర్ కేర్‌కు కాల్ చేసి, మీ ఖాతాను, దానికి అనుసంధానమైన గూగుల్‌పే, ఫోన్‌పే వంటి అన్ని యూపీఐ సేవలను తాత్కాలికంగా నిలిపివేయమని కోరండి.
పోలీసులకు ఫిర్యాదు: సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, ఎఫ్ఐఆర్ కాపీని తీసుకోండి.
సీఈఐఆర్ పోర్టల్‌లో బ్లాక్: కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) వెబ్‌సైట్ (www.ceir.gov.in) లో ఫిర్యాదు చేసి మీ ఫోన్ IMEI నంబర్‌ను బ్లాక్ చేయండి. దీనివల్ల ఆ ఫోన్ భారతదేశంలో ఏ నెట్‌వర్క్‌లోనూ పనిచేయదు.
ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కష్టపడి సంపాదించుకున్న డబ్బును సైబర్ నేరగాళ్ల పాలు కాకుండా కాపాడుకోవచ్చు.


