దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భక్త జనసంద్రంగా మారింది. సమ్మక సారక్క జాతర సమీపిస్తున్న నేపథ్యంలో సోమవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. వేలాది సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలతో పాటు సమీప ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి.
ఈ క్రమంలో సుమారు 90వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మరోవైపు దొరికిందే ఛాన్సుగా కొంతమంది దళారులు భక్తుల అవసరాల్ని ఆసరాగా చేసుకుని వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తూ దొడ్డి దారిన వారిని దర్శనాలకు పంపించి, జేబులు నింపుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
స్వయంగా రంగంలోకి దిగిన ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్
వేలాది సంఖ్యలో భక్తులు తరలి రావడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈ.వో కృష్ణ ప్రసాద్ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ, అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఒకానొక సమయంలో భక్తులు బయటకు వెళ్లే దారి వద్ద, రద్దీ వేళలో సుమారు 5గంటల పాటు అక్కడే వేచి ఉండి,భక్తుల రద్దీని, అక్రమ మార్గంలో వచ్చే వారిని నియత్రించి, సామాన్య భక్తులకు సులువుగా దర్శనం అయ్యేలా చర్యలు చేపట్టారు. దీంతో ఆలయ ఈవో తీరు పట్ల సామాన్య భక్తులు హర్షం వ్యక్తం చేశారు.