Apartment building maintenance schedule : కుండపోత వర్షానికి ప్రహరీ కూలింది… పైకప్పు పెచ్చులూడిపడ్డాయి… గోడలన్నీ నాచుపట్టి, బీటలు వారి భవనం కళావిహీనంగా మారింది… ఇది నగరంలోని అనేక పాత అపార్ట్‌మెంట్ల దుస్థితికి నిలువుటద్దం. లక్షలు పోసి కొనుక్కున్న సొంతింటి కల, కొద్దిపాటి నిర్లక్ష్యంతో పీడకలగా మారుతోంది. అసలు అపార్ట్‌మెంట్ల ఆయుష్షు ఎంత? వాటిని శిథిలావస్థకు చేరకుండా కాపాడుకోవడం ఎలా..? కేవలం ఐదేళ్లకోసారి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన అపార్ట్‌మెంట్‌ను శతవసంతాలు చూసేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్న ఆ రహస్యాలేంటి..?
హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్ల సంస్కృతి 1975-80 మధ్యకాలంలో ప్రారంభమైంది. నేడు నగరంలో సుమారు 2.5 లక్షల నుంచి 3 లక్షల అపార్ట్‌మెంట్లు ఉండగా, వాటిలో 20% వరకు 30 ఏళ్లకు పైబడినవేనని ఒక అంచనా. కాలం గడిచేకొద్దీ ఈ భవనాల్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. వరుస వర్షాలకు ఈ సమస్యలు మరింత జటిలమవుతున్నాయి. అయితే, కొత్త, పాత అనే తేడా లేకుండా అన్ని అపార్ట్‌మెంట్‌లకు ప్రణాళికాబద్ధమైన నిర్వహణ చేపడితే వాటి జీవితకాలాన్ని 70 నుంచి 100 ఏళ్ల వరకు పెంచవచ్చని నగర ముఖ్య ప్రణాళికాధికారి కె. శ్రీనివాస్ స్పష్టం చేస్తున్నారు.
నిపుణులు సూచిస్తున్న కీలక నిర్వహణ చర్యలు..
లీకేజీల గండం: 20 ఏళ్లు దాటిన అపార్ట్‌మెంట్లలో 35% నుంచి 60% వరకు లీకేజీ సమస్యలు సర్వసాధారణమని పలు అధ్యయనాలు తేల్చాయి. పైకప్పు వాలు సరిగా లేకపోవడం, గోడల్లో పగుళ్లు, ట్యాంకులకు సున్నం వేయకపోవడం వంటి కారణాలతో స్లాబులు దెబ్బతింటాయి. వీటిని వెంటనే సరిచేయాలి.
వైరింగ్ మార్పు తప్పనిసరి: పాత భవనాల్లోని అల్యూమినియం వైరింగ్ వ్యవస్థ ప్రస్తుత విద్యుత్ అవసరాలకు ఏమాత్రం సరిపోదు. దీనివల్ల విద్యుదాఘాత ప్రమాదాలు పొంచి ఉంటాయి. ప్రతి 10-15 సంవత్సరాలకు ఒకసారి అపార్ట్‌మెంట్ మొత్తానికి కొత్త వైరింగ్, ఆధునిక ప్యానెల్‌బోర్డులు ఏర్పాటు చేసుకోవడం అత్యవసరం.
ప్రాణాలు తీస్తున్న పాత లిఫ్టులు: నగరంలో ఇటీవల జరుగుతున్న లిఫ్టు ప్రమాదాల్లో అత్యధికం పాతవే. ముఖ్యంగా వర్షాకాలంలో సెల్లార్‌లోకి నీరు చేరితే లిఫ్టులు, ప్యానెల్‌బోర్డులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీనికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవడం తప్పనిసరి.
పైపులైన్లు మార్చాల్సిందే: పాత అపార్ట్‌మెంట్లలోని బంకమట్టి, సిమెంట్ పైపుల జీవితకాలం 20-30 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత అవి వ్యర్థాలతో మూసుకుపోయి మురుగునీటి వ్యవస్థను స్తంభింపజేస్తాయి. కాబట్టి ప్రతి 20 ఏళ్లకోసారి తాగునీటి, మురుగునీటి పైపులైన్లను పూర్తిగా మార్చాలి.
కీటకాల బెడద: పాత అపార్ట్‌మెంట్లలో పురుగులు, బొద్దింకలు, చెదల సమస్యలు కొత్తవాటితో పోలిస్తే రెండింతలు అధికంగా ఉంటాయి. క్రమం తప్పకుండా పెస్ట్ కంట్రోల్ చేయించడం చాలా ముఖ్యం. 30 ఏళ్లు దాటిన అపార్ట్‌మెంట్ల నిర్వహణ వ్యయం, 15 ఏళ్లలోపు భవనాలతో పోలిస్తే 30% అదనంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఖర్చుకు వెనకాడకుండా ప్రతి ఐదేళ్లకోసారి అపార్ట్‌మెంట్ వాసులు మేల్కొని సంపూర్ణ నిర్వహణ చేపడితే, భవిష్యత్తులో భారీ నష్టాల నుంచి, ప్రాణాపాయం నుంచి తమ నివాసాలను కాపాడుకోవచ్చు.


