Case File on Ram Gopal Varma: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా పిలువబడే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై రిటైర్డ్ ఏపీఎస్ అధికారిణి అంజనా సిన్హా క్రిమినల్ కేసు పెట్టారు. 2022లో ఆయన నిర్మించిన ‘దహనం’ వెబ్ సీరీస్‌లో అనుమతి లేకుండా తన క్యారెక్టర్‌ను ఉపయోగించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు వెబ్ సిరీస్ నిర్మాత ఆర్జీవీ, అలాగే దర్శకుడిపై ఐపీసీ సెక్షన్లు 509 (మహిళల పరువుకు భంగం కలిగించడం), 468 (మోసం ఉద్దేశంతో నకిలీ పత్రాలు తయారు చేయడం), 469 (పరువు నష్టం కలిగించే ఉద్దేశంతో నకిలీ పత్రాలు సృష్టించడం), 500 (పరువు నష్టం), 120(B) (నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ కేసుపై రామ్ గోపాల్ వర్మ ఇప్పటివరకు స్పందించలేదు. ఇదిలా ఉండగా, గతంలో కూడా ఆయనపై పలు సందర్భాల్లో కేసులు నమోదయ్యాయి.
Also Read: https://teluguprabha.net/telangana-news/telangana-liberation-day-sep-17/
దావూద్ ఇబ్రహీం తన గురువంటూ ట్వీట్..
తాజాగా, రామ్ గోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నారు. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన చేసిన ఓ ట్వీట్ వివాదానికి కారణమైంది. టీచర్స్ డే సందర్భంగా తాను ఈ స్థాయికి రావడానికి స్ఫూర్తినిచ్చిన గురువులను ప్రస్తావిస్తూ వర్మ ఒక ట్వీట్ చేశారు. ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్, శ్రీదేవి, స్టీవెన్ స్పీల్‌బర్గ్ వంటి దిగ్గజాలతో పాటు గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం పేరును కూడా చేర్చాడు. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. “నాలో సినిమాలపై ఆసక్తి పెంచి, ఎలాంటి సినిమాలు తీయాలనే విషయంపై స్పూర్తినిచ్చిన అందరికి, గొప్ప వ్యక్తులకు బిగ్ సెల్యూట్. వారిలో స్టీవెన్ స్పీల్‌బర్గ్, బ్రూస్ లీ, అమితాబ్ బచ్చన్, ఐన్ ర్యాండ్, శ్రీదేవి, దావూద్ ఇబ్రహీం ఉన్నారు. హ్యాపీ టీచర్స్ డే.” అంటూ ట్వీట్ చేశారు. ఇంతటి ఆగకుండా మరో ట్వీట్ వదిలారు. “నాకు చాలా విషయాలు నేర్పించిన వారిలో పోలీసులు, గ్యాంగ్‌స్టర్లు, రాజకీయ నాయకులు, దయ్యాలు, ChatGPT వంటివి ఉన్నాయి. నాకు ఏమీ నేర్పించని వారు నా స్కూల్, కాలేజీ టీచర్స్ మాత్రమే. వారికి హ్యాపీ టీచర్స్ డే.” అంటూ మరో ట్వీట్ కూడా చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆర్జీవీపై తీవ్రంగా మండిపడ్డారు. కరుడుగట్టిన ఉగ్రవాదిగా పేరుపొందిన దావూద్ ఇబ్రహీంను ఒక గురువుగా పేర్కొనడమే కాకుండా ఉపాధ్యాయ దినోత్సవం రోజున నిజమైన గురువులను గౌరవించే బదులు ఒక నేరస్థుడిని ప్రస్తావించడం అభ్యంతరకరమని చాలామంది అభిప్రాయపడ్డారు. ఒకవైపు అమితాబ్ బచ్చన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్ వంటి దిగ్గజాలతో సమానంగా ఒక ఉగ్రవాదిని పోల్చడాన్ని తప్పుపడుతున్నారు. కాగా, రామ్ గోపాల్ వర్మ సినిమాల కంటే.. తన మాటలతో, స్టేట్‌మెంట్లతో తరచూ ఏదో ఒక వివాదాన్ని రాజేస్తుంటారు. ఇలా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు ఆయన వ్యాఖ్యలు కారణంగా వివాదాలు చెలరేగితే.. మరికొన్నిసార్లు ఆయన సినిమాలు వివాదాస్పదం అవుతుంటాయి. అయినప్పటికీ ఆయన పంథా మార్చుకోకుండా వివాదాలే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు.


