Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Hyderabad floods : ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు!

Hyderabad floods : ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు!

CM Revanth Reddy’s visit to Hyderabad flood areas:  కుండపోత వర్షాలతో భాగ్యనగరం మరోసారి జలదిగ్బంధంలో చిక్కుకుంది. ముఖ్యంగా అమీర్‌పేట పరిధిలోని బస్తీలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. ఆయన ఆకస్మిక పర్యటన వరద బాధితులక భరోసా ఇచ్చింది..? అధికారులకు అందిన కీలక ఆదేశాలు ఏంటి..? ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా..? తెలుసుకోవాలంటే కథనం చదవాల్సిందే.

- Advertisement -

గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ అమీర్‌పేట సమీపంలోని బుద్దనగర్, గంగూభాయి బస్తీలు నీట మునిగాయి. ఈ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) మరియు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులతో కలిసి ఆకస్మికంగా పర్యటించారు. ఆయన నేరుగా బస్తీ గల్లీల్లో నడుస్తూ, స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సమస్యలను పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు.

వరద ముంపునకు కారణాలు: గత కొద్దికాలంగా చిన్నపాటి వర్షానికే అమీర్‌పేట పరిధిలోని బుద్దనగర్, గంగూభాయి బస్తీలు వణికిపోతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎగువన ఉన్న ఎస్సార్ నగర్, గాయత్రి నగర్, మరియు ప్రధాన రహదారి నుంచి భారీగా వరద నీరు ఈ కాలనీల్లోకి పోటెత్తుతోంది. గతంలో ఈ సమస్య ఉన్నప్పటికీ, ఎస్సార్ నగర్ ప్రధాన రహదారిపై వైట్ ట్యాపింగ్ రోడ్డు నిర్మించిన తర్వాత పరిస్థితి మరింత తీవ్రంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నడుము లోతు వరకు నీరు చేరుతుండటంతో, తమకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాలు: స్థానిక కార్పొరేటర్ సరళ ఫిర్యాదు మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బుద్ధనగర్‌లోని డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. కాలనీలో వరద బీభత్సానికి డ్రైనేజీ వ్యవస్థలోని లోపాలే కారణమని తేలింది. కాలనీ రోడ్డు కన్నా డ్రైనేజీ కాలువ ఎత్తుగా, ఇరుకుగా ఉండటమే వరద తీవ్రతను పెంచుతోందని అధికారులు నిర్ధారించారు. దీంతో, తక్షణమే ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, కాలనీ పక్కన ఉన్న గంగూబాయి బస్తీ చెరువును కొందరు పూడ్చి పార్కింగ్ స్థలంగా మార్చేశారని స్థానికులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన సీఎం, ఆ ప్రాంతంలో ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరదలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలను వెంటనే సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.

“మా సమస్యలను సీఎం సార్‌కు చెప్పుకున్నాం. వరద నీరు నిలవకుండా ఉండేలా రీడిజైన్ చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే మా సమస్యలు తీరుతాయని నమ్మకం ఉంది,” అని స్థానికులు తెలిపారు.

ప్రభుత్వ స్పందన,సూచనలు: మరోవైపు, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతోందని, ప్రజా సమస్యలపై వేగంగా స్పందిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఆఫీసుల నుంచి అందరూ ఒకేసారి కాకుండా, కొంత విరామం తీసుకుని బయటకు వస్తే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని సూచించారు. అపార్ట్‌మెంట్ వాసులు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మ్యాన్‌హోల్స్, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్బీ కమిషనర్ రంగనాథ్ సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad