Emotional wellness workshops in Hyderabad : “అయ్యో, ఎంత కష్టం వచ్చిందండీ!” అని ఓదార్చేవారే కరువయ్యారా..? గుండెల్లోని భారాన్ని దించుకునేందుకు చోటు దొరకడం లేదా..? అయితే, మీరు ఒంటరి కారు. మీలాంటి వారి కోసమే నగరంలో కొత్తగా వెలిశాయి ‘క్రైయింగ్ క్లబ్‌లు’. ఇంతకీ ఏమిటీ క్లబ్‌లు..? అక్కడ ఏం చేస్తారు..? డబ్బులు కట్టి ఏడవడం వెనుక ఉన్న మతలబు ఏంటి..? తెలుసుకుందాం పదండి.
“బాధ, డబ్బు రెండూ ఒక్కటే… దాచుకుంటే పెరుగుతాయి, పంచుకుంటే తగ్గుతాయి.” ఈ సినిమా డైలాగ్ అక్షర సత్యం. ఆధునిక జీవనశైలిలో ఉరుకుల పరుగుల జీవితంలో మనసు విప్పి మాట్లాడుకునే తీరిక, ఓపిక ఎవరికీ ఉండటం లేదు. కష్టాలు చెప్పుకుంటే చులకనగా చూస్తారనే భయం, నా అనేవాళ్లున్నా సమయం కేటాయించలేకపోవడం వంటి కారణాలతో చాలామంది మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఇలాంటి వారికి మేమున్నామంటూ ఓ సరికొత్త సాంత్వన కేంద్రాలుగా హైదరాబాద్‌లో ‘క్రైయింగ్ క్లబ్‌లు’ ఆవిర్భవించాయి.
ఏమిటీ ‘క్రైయింగ్ క్లబ్’ : విదేశాల్లో ప్రాచుర్యం పొందిన ఈ ‘క్రయింగ్ క్లబ్’ సంస్కృతి ఇప్పుడు మన దేశంలోనూ, ముఖ్యంగా మన హైదరాబాద్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది. 2017లో లాఫ్టర్ థెరపిస్ట్ కమలేష్ గుజరాత్‌లోని సూరత్‌లో తొలిసారిగా ‘హెల్తీ క్రైయింగ్ క్లబ్’ను ప్రారంభించారు. ఆ తర్వాత ముంబయి, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు పాకి, ఇప్పుడు భాగ్యనగరంలోనూ ప్రాచుర్యం పొందుతున్నాయి. ‘ది క్రై క్లబ్ ఎంబ్రేస్ యువర్ ఎమోషన్స్’ వంటి పేర్లతో నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
క్లబ్‌లో ఎలా చేరాలి – ఏం చేస్తారు : ఈ క్లబ్‌లలో చేరాలనుకునే వారు ఆన్‌లైన్‌లో కొంత రుసుము చెల్లించి తమ స్లాట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
నమోదు: ఆన్‌లైన్‌లో నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించి క్లబ్ సెషన్‌లో పాల్గొనడానికి నమోదు చేసుకోవాలి.
సురక్షిత వాతావరణం: ఇక్కడ చేరిన వారంతా అపరిచితులే అయినా, ఒకరినొకరు చులకనగా చూస్తారన్న భయం ఉండదు. అందరూ తమ భావోద్వేగాలను స్వేచ్ఛగా పంచుకునేందుకు అనువైన, సురక్షితమైన వాతావరణాన్ని నిర్వాహకులు కల్పిస్తారు.
బాధల పంపకం: సెషన్‌లో పాల్గొన్న వారు తమ జీవితంలోని బాధాకరమైన సంఘటనలను, ఎదుర్కొన్న సవాళ్లను, మానసిక వేదనను నిర్భయంగా పంచుకుంటారు. ఒకరి కథ మరొకరు వింటూ, “ఈ బాధలో నేను ఒంటరిని కాదు” అనే భావన పొందుతారు.
గైడెడ్ మెడిటేషన్: నిపుణుల పర్యవేక్షణలో ‘గైడెడ్ మెడిటేషన్’ నిర్వహిస్తారు. దీని ద్వారా తమలో పేరుకుపోయిన దుఃఖాన్ని గొంతెత్తి ఏడ్చి బయటకు పంపేలా ప్రోత్సహిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా గుండెల్లోని భారం దిగిపోయి, మనసు తేలికపడుతుంది.
నిపుణుల సలహాలు: ఇక్కడ మానసిక నిపుణులు, థెరపిస్టులు అందుబాటులో ఉంటారు. వారు ఇచ్చే థెరపీలు, సలహాల ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు.
ఏడుపు మంచిదేనంటున్న నిపుణులు : ఏడవడం బలహీనతకు చిహ్నం కాదని, అది మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మానసిక వైద్యులు స్పష్టం చేస్తున్నారు. “ఏడుపు వల్ల మెదడు నుంచి ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదలై బాధను, ఒత్తిడిని తగ్గిస్తుంది. గతం తాలూకు గాయాలను మానిపించడానికి, సామాజిక బంధాలను బలోపేతం చేసుకోవడానికి ఇలాంటి క్లబ్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి,” అని మానసిక వైద్యురాలు డా. కృష్ణ సాహితి పేర్కొన్నారు.
మారుతున్న కాలంలో బంధాలు బలహీనపడి, సాంకేతికతకు బానిసలవుతున్న తరుణంలో ఇలాంటి క్లబ్‌ల ఆవశ్యకత పెరుగుతోంది. ఆన్‌లైన్ యాప్‌లలో మనసులోని మాటలు చెప్పి మోసపోవడం, ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవడం వంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. వీటన్నింటికీ ప్రత్యామ్నాయంగా, సురక్షితమైన వాతావరణంలో మనసులోని భారాన్ని దించుకునేందుకు ఈ ‘క్రైయింగ్ క్లబ్‌లు’ చక్కని వేదికగా నిలుస్తున్నాయి.


