తెలంగాణలో ఈఏపీసెట్ పరీక్ష రాసిన అభ్యర్థుల కోసం ఆసక్తికరమైన వార్త. ఈఏపీసెట్–2025 ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. ఆదివారం ఉదయం 11:15 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు.
ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఫలితాల్లో ఏపీకి చెందిన పల్ల భరత్ చంద్ర టాప్ ర్యాంక్ సాధించగా, తెలంగాణకు చెందిన ఊదగండ్ల రామ చరణ్ రెడ్డి రెండో స్థానం దక్కించుకున్నాడు. అగ్రికల్చర్-ఫార్మసీ విభాగంలో సాకేత్ రెడ్డి పెద్దకగరి తొలిస్థానాన్ని సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచాడు. ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్: https://eapcet.tgche.ac.in
ఈఏపీసెట్ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకూ నిర్వహించారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్-ఫార్మసీ పరీక్షలు, మే 2, 3, 4 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు జరిగాయి. ఇంజినీరింగ్ విభాగానికి మొత్తం 2,20,327 మంది దరఖాస్తు చేసుకోగా, 2,07,190 మంది పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 86,762 మంది అప్లై చేయగా, 81,198 మంది హాజరయ్యారు. ప్రతి ఏడిలాగే ఈసారి కూడా జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ – హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఫలితాల ఆధారంగా కౌన్సిలింగ్ ప్రక్రియ చేపడతారు.