Ganesh Chaturthi Hyderabad arrangements : గణనాథుని నామస్మరణతో భాగ్యనగరం మార్మోగనుంది. వీధివీధినా బొజ్జ గణపయ్య కొలువుదీరి, నవరాత్రుల పాటు పూజలందుకోనున్నాడు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా, చరిత్రలో నిలిచిపోయేలా ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కمرం బిగించింది. నగరం నలుమూలల నుంచి సాగర తీరం వరకు సాగే 303 కిలోమీటర్ల మహా శోభాయాత్రకు సర్వం సిద్ధమవుతోంది. అసలు ఈ ఏడాది ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉన్నాయి..? లక్షలాది భక్తుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్టమైన చర్యలేంటి.? నిమజ్జన పర్వాన్ని సజావుగా, సురక్షితంగా ముగించేందుకు అధికారులు రచించిన వ్యూహమేంటి?
ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న గణేశ్ నవరాత్రుల కోసం జీహెచ్‌ఎంసీ, పోలీస్, విద్యుత్, వైద్యారోగ్య, జలమండలి వంటి పలు కీలక ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో భారీ ప్రణాళికను సిద్ధం చేశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా, అడుగడుగునా నిఘా పెట్టి, పండుగను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు పక్కా కార్యాచరణ రూపొందించారు.
సాగర తీరాన పటిష్ట బందోబస్తు: పండుగలో అత్యంత కీలకమైన నిమజ్జన ఘట్టం 11వ రోజున జరగనుంది. ముఖ్యంగా, ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని సెప్టెంబరు 6వ తేదీ మధ్యాహ్నానికే పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో, హుస్సేన్‌సాగర్ చుట్టూ తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు రెండు వరుసల కంచెను, అన్ని రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం జలమండలి ఆధ్వర్యంలో తాగునీటి శిబిరాలు, వైద్యారోగ్య శాఖ తరఫున 7 వైద్య శిబిరాలు, 13 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. “ఎప్పటికప్పుడు తలెత్తే సమస్యలను తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం” అని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ. కర్ణన్ తెలిపారు.
బ్రాండ్ హైదరాబాద్ లక్ష్యంగా : హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో గణేశ్ ఉత్సవాలను నగరం బ్రాండ్ ఇమేజ్‌ను ఇనుమడింపజేసేలా నిర్వహిస్తామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లో మేయర్ విజయలక్ష్మి, డీజీపీ జితేందర్, కమిషనర్ కర్ణన్ తదితరులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన నిమజ్జన ఉత్సవ కార్యాచరణ గైడ్‌ను ఆవిష్కరించారు.
ప్రధాన నిమజ్జన కేంద్రాలు: హుస్సేన్‌సాగర్‌తో సహా మొత్తం 20.
కృత్రిమ కోనేరులు: నగరవ్యాప్తంగా 60 ఏర్పాటు.
క్రేన్లు: 141 స్టాటిక్, 295 మొబైల్ క్రేన్లు సిద్ధం.
సహాయక చర్యలు: హుస్సేన్‌సాగర్ వద్ద 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లు, 16 డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తం.
పారిశుద్ధ్యం: 303 కి.మీ. శోభాయాత్ర మార్గంలో 14,486 మంది కార్మికులు విధుల్లో పాల్గొంటారు. 102 మినీ టిప్పర్లు, 125 జేసీబీలు వ్యర్థాల తరలింపునకు సిద్ధం.
భక్తుల సౌకర్యాలు: 309 సంచార మరుగుదొడ్లు అందుబాటులో ఉంటాయి.
విద్యుద్దీపాలంకరణ: చెరువులు, కోనేరుల వద్ద 52,270 లైట్లతో అలంకరణ.
ఉచిత విగ్రహాల పంపిణీ: జీహెచ్‌ఎంసీ 1 లక్ష, పీసీబీ 2 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నాయి.


