Heavy Rains in Hyderabad: నగరంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం కురిసింది. నగర శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్, వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట, రామోజీ ఫిల్మ్‌సిటీ పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పలు చోట్ల వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. పండుగ సెలవులు రావడంతో పాటు భారీ వర్షం నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, రాగల 3 రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈనెల 25 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతం దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఆ అల్పపీడనం దక్షిణ ఒడిశా.. ఉత్తరాంధ్ర కోస్తా తీరం సమీపంలో ఈనెల 26 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 27 నాటికి అదే ప్రాంతంలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వివరించారు.
Also Read: https://teluguprabha.net/business/important-points-to-check-before-go-to-personal-loan/


