హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తూ నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కారుమబ్బులు కమ్ముకుని కుండపోత వర్షం పడటంతో, రోడ్లు నీటమునిగాయి. వడగండ్లు, బలమైన ఈదురుగాలుల కారణంగా చెట్లు విరిగిపడటంతో నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఏర్పడింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి.
నగరంలో కురుస్తున్న భారీ వర్షం ప్రభావం చారిత్రక కట్టడాలపైనా పడింది. చార్మినార్‌కు సమీపంలో ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయానికి ఆనుకుని ఉన్న మినార్‌పై నుంచి కొన్ని పెచ్చులు ఊడిపడ్డాయి. అయితే అదృష్టవశాత్తూ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సచివాలయం, ఆబిడ్స్, నాంపల్లి, పటాన్ చెరువు, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రోడ్లు పూర్తిగా నీట మునిగాయి. పలు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జీహెచ్ఎంసీ, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ట్రాన్స్‌కో, డిస్కంలు పర్యవేక్షణ నిర్వహిస్తున్నాయి.
వరుసగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. రాబోయే గంటల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉండటంతో, ప్రజలు అవసరమైతే మాత్రమే బయటకు రావాలని హెచ్చరించారు.