High-potency hydroponic ganja : బంగారం కాదు, వజ్రం అంతకన్నా కాదు… కానీ కిలో ధర ఏకంగా కోటి రూపాయలు! వింటేనే కళ్లు బైర్లు కమ్మే ఈ ధర విదేశాల నుంచి హైదరాబాద్ మహానగరంలోకి అక్రమంగా ప్రవహిస్తున్న ఓ కొత్త రకం గంజాయిది. ఇప్పటివరకు సాధారణ గంజాయి, డ్రగ్స్‌తో సతమతమవుతున్న దర్యాప్తు సంస్థలకు ఈ ‘హైడ్రోపోనిక్ గంజాయి’ పెను సవాలుగా మారింది. అసలేంటీ హైడ్రోపోనిక్ గంజాయి..? మట్టి లేకుండా ప్రయోగశాలల్లో దీనిని ఎలా పండిస్తున్నారు..? అత్యంత ఖరీదైన ఈ మత్తు పదార్థం ఎవరిని లక్ష్యంగా చేసుకుని నగరంలోకి ప్రవేశిస్తోంది..?
భాగ్యనగరంపై అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా కన్నుపడింది. యువతను లక్ష్యంగా చేసుకుని సరికొత్త, అత్యంత ప్రమాదకరమైన మత్తు పదార్థాలను నగరంలోకి గుట్టుచప్పుడు కాకుండా చేరవేస్తోంది. తాజాగా వెలుగుచూసిన ‘హైడ్రోపోనిక్ గంజాయి’ దందా దర్యాప్తు సంస్థలనే దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. దీని విలువ కిలోకు ఏకంగా కోటి రూపాయలు పలుకుతుండటం దీనికి ఉన్న డిమాండ్‌ను, ప్రమాద తీవ్రతను స్పష్టం చేస్తోంది. కేవలం నెల రోజుల వ్యవధిలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు సంయుక్తంగా రూ.53 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకోవడం నగరంలో పెను కలకలం రేపింది.
ఏమిటీ హైడ్రోపోనిక్ గంజాయి : సాధారణంగా గంజాయి మొక్కలను మారుమూల ప్రాంతాల్లో నేలపై సాగు చేస్తారు. పంట చేతికి రావడానికి కనీసం నాలుగు నెలల సమయం పడుతుంది. కానీ, హైడ్రోపోనిక్ విధానం ఇందుకు పూర్తి భిన్నం.
ప్రయోగశాలల్లో పెంపకం: ఈ విధానంలో మట్టితో సంబంధం లేకుండా, రహస్యంగా ఏర్పాటు చేసిన ప్రయోగశాలల్లో గంజాయిని పెంచుతారు.
ద్రవరూప పోషకాలు: మొక్కలకు అవసరమైన సూక్ష్మ పోషకాలను ద్రవరూపంలో నేరుగా వేళ్లకు అందిస్తారు.
కృత్రిమ వాతావరణం: ఉష్ణోగ్రత, వెలుతురును కృత్రిమంగా నియంత్రిస్తూ మొక్కలు అత్యంత వేగంగా పెరిగేలా చేస్తారు.
మత్తు కొకైన్‌తో సమానం : ఈ ప్రత్యేక పెంపకం వల్ల హైడ్రోపోనిక్ గంజాయిలో మత్తు కలిగించే టెట్రాహైడ్రోకెన్నబినోల్ (THC) శాతం అత్యధికంగా ఉంటుంది. సాధారణ గంజాయితో పోలిస్తే ఇందులో మత్తు 30 శాతం అధికంగా, దాదాపు కొకైన్‌తో సమానంగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ఇది యువత నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
థాయ్‌లాండ్ నుంచి దిగుమతి : ఈ కొత్తరకం మత్తు పదార్థం ప్రధానంగా థాయ్‌లాండ్ వంటి దేశాల నుంచి దిగుమతి అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని దేశాల్లో గంజాయి సాగుపై నిషేధం లేకపోవడాన్ని స్మగ్లర్లు ఆసరాగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలను క్యారియర్లుగా వాడుకుని విమాన మార్గంలో హైదరాబాద్‌కు చేరవేస్తున్నారు.
ఇటీవల వెలుగుచూసిన ప్రధాన కేసులు: జులై 30, 2025: శంషాబాద్ విమానాశ్రయంలో ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి ఏకంగా 40 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆగస్టు 12, 2025: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి వచ్చిన మరో ప్రయాణికురాలి లగేజీలో రూ.13 కోట్ల విలువైన 13 కిలోల సరుకును గుర్తించి సీజ్ చేశారు.


