Hyderabad Delivery Boy Accident:హైదరాబాద్‌లో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నగర వీధులను నదీ ప్రవాహాల్లా మార్చాయి. ఈ వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. ఈ క్రమంలో టీకేఆర్ కమాన్ సమీపంలో ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్తున్న ఓ యువకుడికి అనుకోని సంఘటన ఎదురైంది. వర్షం నీరు అడ్డంగా ఉండటంతో బైక్ అదుపు తప్పడంతో డ్రైనేజీలో పడిపోయాడు. అతడి బైక్, ఫుడ్ డెలివరీ బ్యాగ్ కూడా నీటిలో కొట్టుకుపోయాయి.
స్థానికులు వెంటనే స్పందించి యువకుడిని, అతడి బైక్‌ను బయటకు తీశారు. అయితే, డెలివరీ బ్యాగ్, మొబైల్ ఫోన్ మాత్రం నాలాలోనే కొట్టుకుపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ లోపాలు, వర్షాకాలంలో రోడ్ల దుస్థితిని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది. అధికారులు వర్షాకాలంలో రోడ్ల భద్రత, డ్రైనేజీ మెరుగుదలపై దృష్టి పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇక హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలతో నగరం అతలాకుతలమయ్యింది. వర్షంతో రోడ్లు నదుల్లా మారి, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడ డ్రైనీజీ వరదలా పొంగింది. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు.


